భారత పార్లమెంటుకు లండన్ సెగ

-   రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేంద్రం - క్షమాపణలు చెప్పాలని  డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత పార్లమెంటుకు లండన్ సెగ తగిలింది. దీంతో లోక్సభ రాజ్యసభలు గంట పాటు అధికార ప్రతిప క్ష పార్టీల సభ్యుల ఆందోళనలతో దద్దరిల్లాయి. ఇరు పక్షాలు కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఉభయసభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి.ఏం జరిగింది?ఇటీవల లండన్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభ  సభ్యుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అక్కడి ఓ సంస్థలో నిర్వహించిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. భారత్లో ప్రజాస్వామ్యం లేదని.. నియంతృత్వ పాలన సాగుతోందని మోడీపై విరుచుకుపడ్డారు. విశ్వగురువుగా పైకి చెప్పుకొంటున్నా.. అంత సీన్ లేదన్నారు. అంతేకాదు.. ప్రతిపక్షాలు మాట్లాడాలంటే మైక్ ఇవ్వరని.. పత్రికలను కూడా అజమాయిషీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.అయితే.. తాజాగా ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం పార్లమెంటులో నిలదీసింది. పార్లమెంట్ రెండో దశ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే బీజేపీ సభ్యులు కేంద్ర మంత్రులు రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.  రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం.. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.లోక్ సభలో  రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ లండన్ అంశాన్ని  ప్రస్తావించారు. “లండన్ గడ్డపై రాహుల్ గాంధీ భారత్ను అవమానించారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను కోరారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులంతా ఖండించాలి. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి” అని రాజ్నాథ్ డిమాండ్ చేశారు.అయితే రాజ్నాథ్ విమర్శలను కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించారు. ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విదేశాల్లో విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభ లోనూ ఇదే విషయంపై గందరగోళం చోటుచేసుకుంది.
సభ ప్రారంభం కాగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. రాహుల్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. “ఓ సీనియర్ రాజకీయ నాయకుడు విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం సిగ్గుచేటు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో.. ఓ కాంగ్రెస్ నేత చట్టాల ప్రతులను చించేసినప్పుడు మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు కాదు” అని గోయల్ మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు గానూ ఆ నేత(రాహుల్ను ఉద్దేశిస్తూ) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది.

Leave A Reply

Your email address will not be published.