సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన

- 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మేరకే పరిపాలన - ఏపీ లో నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోంది - గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన - 45 నెలల్లో ప్రజలకి చేరిన 1.97 లక్షల కోట్ల నగదు - ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు - గర్భిణీలకు పౌష్టికాహారంతో 19 శాతం తగ్గిన నవజాత శిశు మరణాలు - ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఆంధ్రప్రదేశ్:  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏపీ లో నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందని గవర్నర్‌ నజీర్‌ పేర్కొన్నారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబద్ధిదారుల గుర్తింపుకోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు.ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగులో ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 2020-21లో జీఎస్‌డీపీ వృద్ధి రేటులో ఏపీ నెంబర్‌ 1 స్థానంలో ఉందన్నారు. మొత్తంగా 11.43 శాతం అభివృద్ధి సాధించామని గవర్నర్ తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నాడు- నేడుతో స్కూళ్ల ఆధునీకరణ, మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి తెచ్చామన్నారు. నాడు నేడులో 3669 కోట్లతో ఫేజ్‌ 1లో 15717 స్కూళ్ల ఆధునీకరణ చేవామని, ఫేజ్‌ 2లో 8345 కోట్లతో 22345 స్కూళ్ల ఆధునీకరణ జరిగిందన్నారు. 9,900 కోట్లతో 44 లక్ష మంది తల్లులకు అమ్మ ఒడి అందజేసినట్లు చెప్పారు. ఏటా రూ. 15 వేలు ఒక్కో లబ్ధిదారుకి అమ్మ ఒడి ద్వారా లబ్ధి పొందారని వెల్లడించారు.రూ.690 కోట్లతో 5.20 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశామన్నారు. జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి మేలు చేశామన్నారు. ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 3255 రోగాలకు చికిత్స అందజేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌ చికిత్స కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చామని అన్నారు. వైద్య శాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్‌ కార్డులు పంపిణీ జరిగిందన్నారు. రూ.971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం అమలు చేసినట్లు తెలిపారు. గర్భిణీలకు పౌష్టికాహారంతో నవజాత శిశు మరణాలు 19 శాతం తగ్గుదల అయ్యిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.