లైంగిక వేదింపు లో  హర్యానా క్రీడల శాఖ మంత్రి పై కేసు నమోదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హర్యానా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ పై ఓ జూనియర్ అథ్లెటిక్స్ మహిళా శిక్షకురాలు చేసిన ఆరోపణలపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ఆయన లైంగికంగా వేధించినట్లు కేసు నమోదు కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి, తన మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖత్తార్ కు అప్పగించారు.దీప్ సింగ్‌పై చండీగఢ్‌లోని సెక్టర్ 26 పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు చేశారు. ఆయన జూనియర్ మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించారని, చట్టవిరుద్ధంగా నిర్బంధించారని, నేరపూరితంగా బెదిరించారని ఆరోపించారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. తనపై నమోదైన ఆరోపణలు నిరాధారమని ఆయన పేర్కొన్నారు.సందీప్ సింగ్ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన ఒలింపియన్ కూడా. ఆయన తనను లైంగికంగా వేధించారని జూనియర్ మహిళా కోచ్ శుక్రవారం చండీగఢ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో, నగర పోలీస్ సూపరింటెండెంట్ శ్రుతి అరోరాకు ఫిర్యాదు చేశారు. అనంతరం అరోరాతో కలిసి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా చౌదరితో కూడా మాట్లాడారు.ఇదిలావుండగా, తన మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖత్తార్‌కు అప్పగించానని సందీప్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. నైతిక కారణాలతో బాధ్యత తీసుకుని తాను తన శాఖను ముఖ్యమంత్రికి అప్పగించినట్లు తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.‘‘నా ప్రతిష్ఠను నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది. నాపై మోపిన తప్పుడు ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. దర్యాప్తు నివేదిక వచ్చే వరకు నా మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రికి అప్పగించాను’’ అని సందీప్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.ఫిర్యాదుదారు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ (ప్రతిపక్ష పార్టీ) కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. సందీప్ సింగ్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన తనను గత ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబరు వరకు వేధించినట్లు ఆరోపించారు. తన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.