మురికి కూపాలకు స్వచ్ఛ అవార్డులా?

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం “స్వచ్ఛ భారత్” పేరిట హైదరాబాద్ నగరానికి ‘స్వచ్ఛ అవార్డు’ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య ఒక ప్రకటనలో విస్మయం వ్యక్తం చేశారు. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా చెత్త కుప్పలు, మురికి కూపాలు దర్శనం ఇస్తుంటే స్వచ్ఛ అవార్డు ఎలా ఇస్తారని ఆయన ఆదివారం ఒక ప్రకటన లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో సంపన్నులు నివసించే ఏ కొద్ది ప్రాంతమో మినహాయిస్తే ఎక్కడైనా పారిశుద్య నిర్వహణ ఉందా అని పేర్కొన్నారు. ‘ఏ చెట్టు లేకపోతే వెంపల చెట్టే మహా వృక్షం’ అన్నట్లు దేనికో దానికి ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నమే ఈ అవార్డుల ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. పదేళ్ల నుంచి స్వచ్ఛత పేరుతో పాలకులు చేస్తున్న నిర్వాకం ఇదేనా అని ఆయన తన ప్రకటనలో మండిపడ్డారు. అర్హత లేని నగరానికి ఈ అద్భుత అవార్డు ఇచ్చి స్వచ్ఛతకు కొత్త నిర్వచనం చెప్పొద్దని ఆయన కేంద్రానికి హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.