ఒక సామాన్యుడి మాదిరి గుడికి వెళ్లిన హైకోర్టు న్యాయమూర్తి

-బోలెడన్ని దారుణాలు కంట్లో పడటమే..కాకుండా అవమానం పాలు

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఎవరైనా సరే.. తమకున్న స్థాయిని పక్కనపెట్టేసి.. సాదాసీదాగా బయటకు వచ్చి చూడగలిగితే.. బోలెడన్ని దారుణాలు కంట్లో పడటమే కాదు.. చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని.. పరిస్థితుల్ని మార్చాల్సిన అవసరం ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా అలాంటి పనే చేశారు ఒక హైకోర్టు న్యాయమూర్తి. చట్టబద్ధంగా తనకున్న ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. కుటుంబ సభ్యులతో కలిసి ఒక సామాన్యుడి మాదిరి గుడికి వెళ్లిన ఆయనకు.. ఊహించని షాకులెన్నో తగిలాయి.మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ఆయన కుటుంబ సభ్యులు కలిసి చెన్నైలోని వడపళని ప్రాంతంలో ఉన్న దండాయుధపాణి టెంపుల్ కు వెళ్లాలని భావించారు. నిబంధనల ప్రకారం ఆయనకు ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. అలాంటివి తీసుకోవటం ఇష్టం లేని ఆయన.. సామాన్య భక్తుడి మాదిరిగా కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వల్లారు. స్పెషల్ దర్శనం టికెట్లను కొనుగోలు చేశారు. రూ.50 విలువైన మూడు టికెట్ల కోసం రూ.150 ఇవ్వగా.. రెండు రూ.50 టికెట్లను ఇచ్చి.. మరొకటి రూ.టికెట్ ఇచ్చారు. తనకు మాదిరే ఇతర భక్తులకు ఇచ్చే టికెట్ల విషయంలోనూ ఇలాంటిదే జరుగుతుందని గమనించారు.దర్శనం ముగించుకున్న అనంతరం గుళ్లో జరుగుతున్న లోపాలను.. అవకతవకలను గుర్తించిన ఆయన.. దీనిపై మాట్లాడేందుకు ఈవో గది వద్దకు వెళ్లారు. అక్కడ ఈవో అందుబాటులోకి లేకపోవటంతో.. ఆయన ఫోన్ నెంబరు ఇవ్వాలని అక్కడి సిబ్బందిని కోరారు. దీనికి వారు అసభ్యకరంగా మాట్లాడటమే కాదు అవమానించారు. దురుసుగా వ్యవహరించారు. గుళ్లో ఎలాంటి అక్రమాలు జరగటం లేదని వాదించారు. సిబ్బంది దురుసు ప్రవర్తనను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం.పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఈవో ఫోన్ నెంబరు ఇచ్చేందుకు ఆలయ సూపరింటెండెంట్ ససేమిరా అన్నారు. దీంతో.. కంప్లైంట్ నమోదు చేసి వారిని కోర్టు ఎదుట హాజరుపర్చాలంటూ ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత రోజు హైకోర్టు ఎదుట హాజరైన ఈవోపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమాలపై ప్రజలు కంప్లైంట్లు చేసేందుకు అధికారుల ఫోన్ నెంబర్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తన ఫోన్ నెంబరును ప్రజలకు ఇస్తున్న వేళ.. ఈవో నెంబరు ఇవ్వటానికి ఉన్న ఇబ్బంది ఏమిటని తన భార్య తనను ప్రశ్నించినట్లుగా చెప్పారు హైకోర్టు న్యాయమూర్తి. స్థానిక పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయిందని.. లేనిపక్షంలో ప్రశ్నించిన తనను ఇతర వ్యక్తుల మాదిరే ఆలయ సిబ్బంది బయటకు నెట్టేసేవారన్నారు.వందల కోట్ల ఆస్తులు ఉన్న ఆలయంలో ఇలాంటి పరిస్థితి ఉందంటే.. ఇతర ఆలయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది ఆలోచించటానికే తనకు భయంగా ఉందన్నారు. సామాన్య వ్యక్తి మాదిరి వెళ్లినప్పుడే సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు.. కష్టాలు.. వారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుస్తాయని.. వీఐపీ హోదాలో వెళితే ఇలాంటివేమీ తెలీవన్నారు. హైకోర్టు జడ్జి గారి మాటలకు తగ్గట్లే.. ప్రముఖులు.. అధికారం చేతిలో ఉన్న వారు సామాన్యుల మాదిరి వెళితే.. అంతో ఇంతో మార్పు వచ్చే అవకాశంఉంటుందంటున్నారు భక్తులు 

Leave A Reply

Your email address will not be published.