తెలంగాణ లో భారీ పరిశ్రమ

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ :  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. బెల్జియం దేశానికి చెందిన అలియాక్సిస్‌ సంస్థ రూ.500 కోట్లతో పైపులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తుల భారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, అలియాక్సిస్‌ కంపెనీ సీఈవో కోయిన్‌ స్టికర్‌ దీనిపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్టికర్‌ మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల కోసం అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేస్తామన్నారు. భారత్‌లో అతిపెద్ద పైపుల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని తాము భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలోని అత్యుత్తమ విధానాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఆశీర్వాద్‌’ పేరుతో పైపులను ఉత్పత్తి చేయనున్న ఈ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, తొలిరోజు రూ. 600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతి కంపెనీల్లోకెల్లా హైదరాబాద్‌లోని తమ సామర్థ్య కేంద్రం అతి పెద్దదని ప్రముఖ ఫార్మా సంస్థ నోవార్టిస్‌ సీఈవో వసంత్‌ నరసింహన్‌ తెలిపారు. దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయిన ఆయన తెలంగాణలో తమ కంపెనీ విస్తరణ ప్లాన్లపై చర్చించారు. స్విట్జర్లాండ్‌ బాసెల్‌లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9 వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్‌ కేంద్రమే పెద్దదని వివరించారు. దీన్ని తమ కృత్రిమ మేధ, డేటా, డిజిటల్‌ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్‌ కేంద్రంగా ఎంచుకుని విస్తరించనున్నట్లు వివరించారు. మరోవైపు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ ఎండీ విజయ్‌ కేటీఆర్‌ను కలిసి తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో తమ కేంద్రాలను విస్తరిస్తామని తెలిపారు. ఇటు భారతి ఎయిర్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిఠల్‌, వైస్‌ చైర్మన్‌, ఎండీ రాజన్‌ భారతి మిఠల్‌ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కొత్త డేటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ వారిని కోరారు. మరోవైపు.. విద్య, వైద్య రంగాల్లో డిజిటలైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని డెలాయిట్‌ సీఈవో పునీత్‌ రంజన్‌ ఆసక్తి చూపారు.

Leave A Reply

Your email address will not be published.