మట్టిలో దొరికిన స్వచ్ఛమైన వజ్రం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వజ్రం వజ్రమే ..అది మట్టిలో ఉన్నా ..లేక చెత్త కుప్పలో ఉన్నా దాని విలువ తగ్గదని మరోసారి రుజువైంది. గోల్డెన్ కనరీ వజ్రానికి ప్రపంచంలోనే అత్యంత స్వచ్చమైన డైమండ్‌గా పేరుంది. అంతటి ఖరీదైన వజ్రం తవ్వకాల్లో మట్టిలో బయటపడింది. ఇదంతా ఓ వజ్రాల మైనింగ్ కంపెనీకి చెందిన స్థలంలోనే బయటపడటంతో దాని విలువను గుర్తించారు. దుబాయ్‌లో డైమండ్‌ని ప్రస్తుతానికి దుబాయ్‌లో ప్రదర్శనకు ఉంచిన ఆ అత్యంత ఖరీదైన డైమండ్ డిసెంబర్‌లో వేలం వేస్తున్నారు. ఆసక్తి కలిగిన వాళ్లు ఎవరైనా న్యూయార్క్‌లో నిర్వహించబోయే వేలం పాటలో పాల్గొని ఆ స్వచ్ఛమైన గోల్డెన్ కనరీ డైమండ్‌ని దక్కించుకోవచ్చు. మరి దాని ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. మనకు వజ్రాల్లో కోహినూర్ వజ్రం పేరు మాత్రమే బాగా తెలుసు. అది అత్యంత ఖరీదైన, అరుదైన వజ్రం కాబట్టే అత్యంత భద్రంగా ఉంచుతున్నారు. అయితే దుబాయ్‌లో అలాంటి స్వచ్చమైన మరో వజ్రాన్ని గుర్తించారు. ప్రపంచంలోనే వజ్రాల మైనింగ్ చేపట్టే ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ 1980లో కాంగో దేశంలో తవ్విన గనికి సంబందించిన తవ్వకాలు జరిపిన మట్టిలో ఈ పసుపు రంగు వజ్రం బయటపడింది. ప్రపంచంలోకెల్లా నాలుగో అతిపెద్ద వజ్రం ఇదే కావడం విశేషం. గోల్డెన్ కనరీ వజ్రంగా పిలవబడే ఈ వజ్రం బరువు 303.1 క్యారెట్లు ఉంది. ప్రస్తుతం దీనిని దుబాయ్‌ లోని సోత్‌ బీ వేలం శాలలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్‌ ఏడో తేదీన న్యూయార్క్‌ లోని సోత్ బీ వేలం శాలలో గోల్డెన్ కనరీ డైమండ్‌ను వేలం వేయనున్నారు. ఈ స్వచ్ఛమైన డైమండ్‌కు కనీస ధరను 123 కోట్లుగా నిర్ధారించారు. వేలం పాటలో అంతకు మించే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. కాంగోలో మట్టి తవ్వకాల్లో బయటపడ్డ సమయంలో ఈ వజ్రం బరువు 890 క్యారెట్లు ఉంది. దాదాపు నలభై ఏళ్లుగా వజ్రాన్ని సానబట్టడం, చేతులు మారడం వల్ల అది కాస్తా బరువు తగ్గిపోయిందని వేలం వేస్తున్న నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతటి స్వచ్ఛమైన , ఖరీదైన వజ్రాన్ని ఏ సంపన్నుడు సొంతం చేసుకుంటాడో తెలియాలంటే డిసెంబర్‌ 7వ తేది వరకు వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.