శ్వేత నాగుతో సెల్ఫీ దిగిన స్నేక్ క్యాచర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీల క్రేజ్ బాగా పెరిగిపోయింది. గుడికి వెళ్లినా, శుభకార్యాలకు వెళ్లినా, విజిటింగ్ స్పాట్లకు వెళ్లినా.. సెల్ఫీ క్లిక్‌మనిపించడం, దాన్ని స్టేటస్‌గా పెట్టుకోవడం అలవాటైంది. అయితే, క్రూరమృగాలతో, విషసర్పాలతో సెల్ఫీ దిగాలని ఎవరైనా కోరుకుంటారా..? ఇప్పుడు అలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం (మార్చి 20) సాయంత్రం అరుదైన శ్వేత నాగు కనిపించింది. తెల్లటి వర్ణంతో మెరిసిపోయిన ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా చూశారు. ఓ ధాన్యం మిల్లు సమీపంలో ఈ పాము కనిపించింది. ఆ మిల్లు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్నేక్ రెస్క్యూ టీం సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

ఆ పామును బంధించే క్రమంలో స్నేక్ టీమ్ సభ్యుడు ఒకరు ఆ విషసర్పంతో సెల్ఫీకి ఫోజిచ్చారు. ఆ పాము కూడా తనకు ఇష్టం ఉన్నట్లే పడగవిప్పి నిల్చుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గడ్చిరోలి జిల్లాకు సరిహద్దు జిల్లా అయిన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వాట్సాప్‌లో ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ‘పాముతో సెల్ఫీ.. నువ్వు గొప్పోడివి సామీ’ అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ సెల్ఫీ తీసుకుంది స్నేక్ క్యాచర్ అని చాలా మందికి తెలియదు. అతడు తగిన జాగ్రత్తతోనే ఉన్నాడేమో! ఏదేమైనా పాముతో చెలగాడం సరికాదు కదా. తిరుపతిలో పాపులర్ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు లాంటి వారే చిన్న అజాగ్రత్త వల్ల పాముకాటుకు గురై, మరణం అంచుల దాకా వెళ్లొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.