అవయవ మార్పిడి విధానంలో ముందడుగు..

- మనిషి శరీరంలో 2 నెలలు సక్రమంగా పనిచేసిన పంది కిడ్నీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మనిషి శరీరంలో ఏదైనా అవయవం పనిచేయకపోతే.. వేరే వ్యక్తుల అవయవాన్ని అమరుస్తుంటారు. కుటుంబ సభ్యులు, లేదా ఇతర వ్యక్తులు తమ అవయవాలను దానం చేస్తే వాటిని అవసరమైన రోగులకు అమరుస్తుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ అవయవాలు దొరకవు. అదృష్టవశాత్తూ దొరికినా రోగి శరీరానికి సరిపోవు. ఈ క్రమంలోనే చాలా మంది జీవితం అర్ధంతరంగా ఆగిపోతుంటుంది. దీంతో అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీ ని మానవ శరీరానికి అమర్చారు. అది ఇప్పుడు సత్ఫలితాన్నిచ్చింది.అమెరికా లో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తికి పంది కిడ్నీ అమర్చగా అది ఎన్నడూ లేని విధంగా ఏకంగా రెండు నెలలపాటు సక్రమంగా పనిచేసింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి అమెరికా వైద్యులు జులై 14వ తేదీన జన్యుమార్పిడి చేసిన పందికిడ్నీని విజయవంతంగా అమర్చారు. నెల రోజులకుపైగా ఆ మూత్రపిండం మనిషి శరీరంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పనిచేసింది. అయితే, ఆ తర్వాత కిడ్నీ ఉత్పత్తి చేసే మూత్ర పరిణామం తగ్గడంతో.. వైద్యులు రోగనిరోధన ఔషధాలతో దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. రెండు నెలల అనంతరం అంటే బుధవారం నాడు ఆ కిడ్నీని మనిషి శరీరం నుంచి తొలగించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ట్రాన్స్‌ప్లాంట్‌ చేసిన పంది మూత్రపిండం మనిషి శరీరంలో గతంలో కంటే ఎక్కువ రోజులు పనిచేయటం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగంతో వైద్య చరిత్రలోనే అవయవ మార్పిడి విధానంలో పెద్ద ముందడుగు పడినట్లైంది.ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో బతికున్న వ్యక్తులపై కూడా ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. కాగా, గతేడాది మేరీల్యాండ్‌ యూనివర్సిటీకి చెందిన వైద్యులు.. చనిపోతున్న ఓ వ్యక్తికి పంది గుండెతో కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, అతను రెండునెలలు మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. ఆ తర్వాత పంది గుండె విఫలం కావటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Leave A Reply

Your email address will not be published.