రోడ్డుపై భిక్షాటన చేసుకుంటున్న వార్డు కౌన్సిలర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జిందం కళా అధ్యక్షతన మునిసిపల్ సాధారణ సమావేశం ప్రారంభమైంది. ఇంతలో బీజేపీ కి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు మున్సిపల్ కార్యాలయం గేటు ముందు బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలోని దుకాణ సముదాయాల్లో బిక్షాటన చేసి నిరసన తెలిపాడు కౌన్సిలర్ నాగరాజు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ..తమ వార్డుకి నిధులు కేటాయించకుండా మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్లు పక్షపాత ధోరణి ఆలంబిస్తున్నారంటూ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే.. రాష్ట్రంలో మిగతా జిల్లాలోని మున్సిపాలిటీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.  నాలుగు సంవత్సరాల క్రితం బలవంతంగా చిన్నబోనాల గ్రామాన్ని సిరిసిల్ల మునిసిపాలిటీల్లో విలీనం చేశారని నాగరాజు మండిపడ్డాడు. గత హరితహారంలో 30 వేల వరకు మొక్కలను వివిధ మహిళా సంఘాల ద్వారా నాటిన జిల్లా అధికారులు.. ఇప్పటివరకు వారికి మహిళా సంఘాలకు నిధులు మంజూరు చేయకపోవడం సూచనీయమన్నారు. విలీన గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఇటీవల సైతం విలీన గ్రామాలపై చిన్న చూపేందుకు విలీన గ్రామాలను మున్సిపల్ నుంచి తీసివేసి గ్రామాలుగా ప్రకటించాలని నిరసన తెలిపారు. విలీన గ్రామాలను వెంటనే మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి చేయాలని, వాటికి నిధులు సైతం మంజూరు చేయాలని కోరారు. వార్డుల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ అధికారులను, చైర్‌పర్సన్‌ను కోరగా నిధులు లేవంటూ చెప్పారని వాపోయాడు. దీనికి నిరసనగానే తమ వార్డు అభివృద్ధి కోసం నిధులు సమకూర్చేందుకు భిక్షాటన చేసినట్లు కౌన్సిలర్ నాగరాజు పేర్కొన్నాడు. మంత్రి కేటీఆర్ విలీన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కౌన్సిలర్ నాగరాజు కోరారు.

Leave A Reply

Your email address will not be published.