బిహార్ లో స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా యువకుడు హల్‌చల్

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు. ఆ యువకుడి పేరు కూడా నితీశ్ కుమార్ కావడం విశేషం.స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోకి నితీశ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు పరుగు పరుగున దూసుకొచ్చాడు. ఆయన చేతిలో ఓ పోస్టర్ ఉంది. తన తండ్రి బిహార్ మిలిటరీ పోలీస్ ఉద్యోగి అని, ఆయన ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగానే మరణించారని, తనకు కారుణ్య ప్రాతిపదికపై ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని ఆ పోస్టర్లో రాశారు.జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో యువకుడు నితీశ్ కుమార్ సీఎం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి, ఆ యువకుడిని అడ్డుకుని, అక్కడి నుంచి పంపించేశారు.

Leave A Reply

Your email address will not be published.