రాష్ట్ర విభజనపై సుప్రీంలో విచారణ వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రాష్ట్ర విభజనపై ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ వికాస్ కేంద్ర సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో సుప్రీం ఈ కేసును వాయిదా వేసింది. బుధ, గురువారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లపై మాత్రమే వాదనలకు తీసుకోవాలని ఉన్నతన్యాయస్థానం ఇటీవల ప్రత్యేక నిబంధన తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం, రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా ఈరోజు విచారణకు రావాల్సిన రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లు వాయిదా పడ్డాయి.సుప్రీంకోర్టు తాజా సర్కులర్, రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్ర విభజన కేసుపై తేదీ నిర్ణయించాలని ఉండవల్లి తరపు న్యాయవాది అల్లంకి రమేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో విచారణకు వచ్చినప్పుడు ఈరోజు విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఉండవల్లి సహా పలువురు వ్యక్తులు పిటిషన్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు నియమ నిబంధనలు అవసరమని ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. న్యాయవాది అల్లంకి రమేష్ విజ్ఞప్తితో పిటిషన్లపై విచారణను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం ఏప్రిల్ 11కి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.