47 ఏళ్ల తర్వాత చంద్రుడి పైకి రష్యా మళ్లీ రాకెట్‌ ప్రయోగం

- చంద్రయాన్‌-3 కంటే రెండు రోజుల ముందే జాబిల్లిపై రష్యా రాకెట్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సుమారు 47 ఏళ్ల తర్వాత చంద్రుడి పైకి రష్యా మళ్లీ రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా – 25’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.00 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి ‘లునా-25’ రాకెట్‌ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఐదు రోజుల్లో ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. అనంతరం, జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజుల పాటు (3 లేదా 7 రోజులు) అన్వేషించిన అనంతరం చంద్రుడిపై దిగుతుంది.ఆగస్టు 21న ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మోస్ అధికారులు పేర్కొన్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే ఏడాది పాటు ఇది జాబిల్లిపై పరిశోధనలు జరపనుంది. అంతరిక్ష పరిశోధనలో రష్యా సత్తా చాటేందుకు ఈ ప్రయోగం చేపట్టామని రష్యా స్పేస్‌ ఏజెన్సీ రాస్‌కాస్మోస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లునార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే కావడం విశేషం.మరోవైపు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ‘చంద్రయాన్-3’ కూడా జాబిల్లి వైపు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇస్రో ప్రణాళిక ప్రకారం చంద్రయాన్-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతుంది. కాగా, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్‌-3’ ద్వారా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు.. లునా-25 పోటీ ఇస్తోంది. చంద్రయాన్‌-3 కంటే రెండు రోజుల ముందే రష్యా పంపిన లునా-25 జాబిల్లిపై అడుగుపెట్టబోతోంది. మరోవైపు లునా-25ని విజయవంతంగా ప్రయోగించడంపై రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌కు ఇస్రో అభినందనలు తెలిపింది. చంద్రయాన్‌-3, లునా-25 తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించింది.

Leave A Reply

Your email address will not be published.