గెలుపే లక్ష్యంగా ..కాంగ్రెస్ కొత్త ఫార్ములా..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణా కాంగ్రెస్ కి అధికారంలోకి వస్తామన్న ధీమా అయితే పెరిగింది. అధినాయకత్వం సైతం ఈసారి తెలంగాణా మనదే అన్న నమ్మకంతో ఉంది. దాంతో పార్టీలో ఉన్న చిన్న పాటి సమస్యలను సరిదిద్దుకుంటే అంతా ఒక్కటిగా పనిచేస్తే పవర్ కాంగ్రెస్ చేతికి వస్తుంది అన్న అంచనాల్లో ఉంది.దాంతో తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్ల మధ్య ఒక చక్కని అవగాహన కుదిర్చే పనిలో హై కమాండ్ ఉందని అంటున్నారు. అంతా ఒకటిగా నిలిస్తే గెలుపు ఖాయమన్న భావనతో పార్టీ హై కమాండ్ తగిన రిపేర్లు చేస్తోంది అనుకుంటున్నారు.ఈ నేపధ్యంలోనే ఒక ఫార్ములాతో హై కమాండ్ ముందుకు వస్తోంది అని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హై కమాండ్ ఫార్ములా కారణంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేతిలో అరవై సీట్లు ఉన్నట్లే అని అంటున్నారు. అలా పీసీసీ చీఫ్ యువకుడు డైనమిక్ లీడర్ అయిన రేవంత్ రెడ్డి కి హై కమాండ్ ఫ్రీ హ్యాండ్ దాదాపుగా ఇచ్చేసింది అని అంటున్నారు.
ఇక మిగిలిన సీట్లలో సీనియర్లకు బాధ్యతలు అప్పచెబుతోంది అని అంటున్నారు. అది కూడా పక్కాగా సర్వేలలో అభ్యర్ధులు గెలుస్తారు అని తేలితేనే టికెట్ అన్న కండిషన్ పెట్టినట్లుగా చెబుతున్నారు. అది రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుంది అని అంటున్నారు. అభ్యర్ధులు ఆశావహులు ఎవరి సిఫార్సుతో వచ్చినా పార్టీ చేయించిన సర్వేలలో గెలుపు అవకాశాలు లేకపోతే మాత్రం టికెట్ ఇచ్చేది ఉండదని అంటున్నారు.అంతే కాదు కర్నాటకలో కాంగ్రెస్ ని బంపర్ మెజారిటీతో గెలిపించిన సునీల్ కనుగోలు తెలంగాణా కాంగ్రెస్ గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఆయనే వ్యూహాలు అన్నీ రచిస్తున్నారు. ఆయన మాట మీదనే ముందుకు సాగాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించుకుందని అంటున్నారు. అంటే సునీల్ కనుగోలు మాటే శిలా శాసనం వేదమని కాంగ్రెస్ అధినాకత్వం భావిస్తోంది అన్న మాట.మొత్తం మీద చూసుకుంటే గతంలోలా గుడ్డిగా కాంగ్రెస్ ఎవరికి పడితే వారికి టికెట్ ఇవ్వదు అని అర్ధం అవుతోంది. పీసీసీ చీఫ్ చెప్పినా లేక సీనియర్ల మద్దతు ఉన్నా కూడా ఆ క్యాండిడేట్ గెలుపు గుర్రం అయి ఉండాలి. అపుడే అతనికి టికెట్ ఇస్తారు.ఈసారి పక్కాగా ప్లాన్ వేసుకుని మరీ కాంగ్రెస్ తెలంగాణా బరిలోకి దూకుతోంది.ఆరు నూరు అయినా గెలిచి తీరాలన్నదే కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. దాంతోనే మొహమాటాలకు పోరాదని భావిస్తోంది. అదేనిజం అయితే మాత్రం అయిదేళ్ళూ హాయిగా ఇంట్లో గడిపి చివరాఖరు నిముషంలో ఎవరో ఒకరిని పట్టుకుని టికెట్ సంపాదించుకుని లక్ ఉంటే గెలిచేద్దామనుకునే బాపతుకు ఈసారి అసలు చాన్స్ లేదని కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే చెబుతున్నారు.దీంతో అందరూ గ్రౌండ్ లోకి వచ్చి పనిచేయాలి. జనంలో పేరు తెచ్చుకోవాలి. గెలుస్తారు అన్న నమ్మకం ఉంటే కచ్చితంగా హై కమాండ్ టికెట్ ఇస్తుంది. సో ఇదన్న మాట మ్యాటర్. మొత్తానికి గెలవడానికి అవసరం అయిన అన్ని వ్యూహాలను కాంగ్రెస్ రెడీ చేసుకుంది అని అంటున్నారు. దాని మీద అంతా ఐక్యంగా ముందుకు అడుగులు వేస్తే మాత్రం తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగరడం  ఖాయమనే అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.