బీసీ హాస్టల్ లో విద్యార్థులకు అన్ని వసతులు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంతో బీసీ పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు హాస్టళ్లలో అన్ని వసతులను సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. బుధవారం ఆయన కరీంనగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వసతుల పెంపుదల వల్ల 34 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని స్పష్టం చేశారు. భోజనం, వసతితో పాటు కాస్మెటిక్, బ్లాంకెట్లు, నోట్ బుక్స్ ఇతరత్రా సౌకర్యాలను అందిస్తున్నామని వివరించారు.ఈ నెల 28న బీసీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీసీ సంఘం నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో జాతీయ సంస్థల్లో బీసీ రియింబర్స్‌మెంట్‌, పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన జీవో విడుదల, లోగో లాంచింగ్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. బీసీ సంక్షేమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో బీసీ రియింబర్స్‌మెంట్‌ ప్రకటించిన ముఖ్యమంత్రికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 19 గురుకులాలు ఉండగా నేడు 327కు పెంచారని గుర్తు చేశారు. గతంలో భోజన, వసతి మాత్రమే అందజేసేవాళ్లమని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలైన రైతుబంధు, ఆసరా పింఛన్లు, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి వంటి పథకాల్లో మెజార్టీ వాటా బీసీలకు అందిస్తున్నామని అన్నారు.కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేలకోట్ల విలువ గల స్థలాల్లో 42కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, కులవృత్తుల పునర్వైభవానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.