తెలంగాణ ద్రోహులంతా ఏకమైండ్రు.. వాళ్లతో జాగ్రత్త

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి హరీష్‌రావు విమర్శల వర్షం కురిపించారు. సంగారెడ్డిలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను భారీ మెజారిటీతో గెలిచించాలని కోరారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ‘ఖర్గే సంగారెడ్డికి వస్తే ఆయన బహిరంగసభకు ఇప్పుడు మన పార్టీ మీటింగ్‌కు వచ్చిన కార్యకర్తలంత మంది గూడా రాలేరు. అది మన బలం. మనం గట్టిగ కార్యరంగంలోకి దిగితే జగ్గారెడ్డి గాల్లో కొట్టుకుపోతడు. సంగారెడ్డిలో అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాలె. ఇటీవల రాష్ట్రంల కొన్ని సర్వేలు వచ్చినయ్‌. ఆ సర్వేలు హ్యాట్రిక్‌ సీఎం కేసీఆరే అని చెప్పినయ్‌. సంగారెడ్డిలో గులాబీ జెండా ఉంటే అభివృద్ధిలో దూసుకుపోవచ్చు’ అని చెప్పారు. ‘జగ్గారెడ్డి గత ఎన్నికలప్పుడు మందుతాగి సత్తనని చెప్పి ఓట్లు దండుకున్నడు. గల్లీకి ఒక ఏటీఎం పెడుత, ఇంటికో కార్డు ఇస్త, ఎన్ని పైసలు కావాలంటే అన్ని డ్రా చేసుకోవచ్చు అని చెప్పిండు. మరి ఏటీఎంలు పెట్టిండ్రా..? కార్డులు వచ్చినయా..? ఇండ్లు వస్తయన్నడు, ప్లాట్లు వస్తయన్నడు. వచ్చినయా..? ఒక్క పనన్న జరిగిందా..? ఈ ఐదేళ్లలో జగ్గారెడ్డి కనీసం ఒక్కసారి కూడా పోని ఊర్లు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నయ్‌. కరోనా వచ్చినప్పుడు పోలే, మంచికి పోలే, చెడుకు పోలే. సంగారెడ్డి ప్రజలకు ఇప్పుడు జగ్గారెడ్డి సంగతి అర్థమయ్యింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌రెడ్డిని గత ఎన్నికల్లో ఓడించినా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నడు. రెమిడిస్‌వేర్‌ ఇంజక్షన్‌లు తెప్పించి ప్రజలను కాపాడిండు. ప్రజలకు కరోనా సందర్భంగా ఎన్నో కిట్లు ఇచ్చిండు. గెలిచిన జగ్గారెడ్డి పత్తాలేకుండా పోయినా ఓడిన చింతా ప్రభాకర్‌ మాత్రం ప్రజల మధ్య ఉన్నడు’ అని మంత్రి ప్రశంసించారు.‘మన సీఎం కేసీఆర్‌ రూ.570 కోట్లతో సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ ఇచ్చిండు. నర్సింగ్‌ కాలేజీ ఇచ్చిండు. ఇయ్యాల సంగారెడ్డి పట్టణంలో, సదాశివపేట పట్టణంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగినయో మీకందరికీ తెలుసు. జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి. నాడు సంగారెడ్డిని కర్ణాటకల కలపాలన్నడు. తెలంగాణ రాష్ట్రం వద్దంటే వద్దన్నడు. తెలంగాణ వ్యతిరేకులతోటి చేతులు కలిపిండు. తెలంగాణ ద్రోహులు పవన్‌ కళ్యాణ్‌, వైఎస్‌ శర్మిలతోటి బీజేపీ, కాంగ్రెస్ అంటకాగుతున్నయ్‌. బీజేపీతోటి పవన్‌ కళ్యాణ్‌ చేతులు కలుపుతున్నడు. కాంగ్రెస్‌తోటి శర్మిల చేతులు కలుపుతున్నది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయకుండా లోపాయికారిగా బీజేపీకి, కాంగ్రెస్‌కు సహకరిస్తున్నడు. ఇప్పుడు తెలంగాణ ద్రోహులంతా కాంగ్రెస్‌, బీజేపీ ముసుగులో ఒక్కటయ్యిండ్రు. ఈ ద్రోహులతో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తెలంగాణ ఆగమైతది’ అని మంత్రి హరీష్‌రావు హెచ్చరించాడు.

Leave A Reply

Your email address will not be published.