విద్యార్థుల సంక్షేమం దిశగా మరో ముందడుగు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌.. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ( ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ) చదువుకునే విద్యార్థినీవిద్యార్థుల కోసం సీఎం అల్పాహార పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ మానవీయ ఆలోచనకు అద్దం పట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.విద్యార్థులకు చక్కటి బోధనతో పాటు పోషకాహారం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచడంలో ఈ పథకం ఎంతగానో దోహదపడనుంది. కాగా తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సీఎం ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం’ పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చింది. కాగా విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సీఎం శ్రీ కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టును అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా దాదాపు ₹400 కోట్ల అదనపు భారం పడనున్నది.

Leave A Reply

Your email address will not be published.