పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. రాష్ట్రంలో మహిళలు అదృష్యానికి వలంటీర్లే కారణం ఆరోపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో మహిళా కమిషన్ పేర్కొంది. అలాగే పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, 10 రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పవన్‌ను కోరారు.

పవన్‌పై ఫిర్యాదు

పవన్ వ్యాఖ్యలపై వలంటీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌ లో పవన్‌పై వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ వారు చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. వారాహి యాత్రలో పవన్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు వ్యాఖ్యానించారు. వలంటీర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వలంటీర్లు ఏం చేస్తున్నారో.. పవన్‌కల్యాణ్ చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ డౌన్ డౌన్ అంటూ వలంటీర్లు నినాదాలు చేశారు.

ఏలూరు సభలో వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు

‘ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల గురించి కేంద్ర నిఘా వర్గం ఏం చెప్పిందో తెలుసా? రాష్ట్రంలో మిస్‌ అయిన ఆడవాళ్ల వెనుక వలంటీర్లు ఉన్నారని..! ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్‌ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వలంటీర్ల పని’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఈ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వెనుక వైసీపీకి చెందిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గం తనకు చెప్పి, ప్రజలకు తెలియజేయమందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.