నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు చనిపోయాయా?

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చంద్రుని ఉపరితలంపై సూర్యోదయం అయినప్పటి నుంచి.. నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరిగి మేల్కొలికపేందుకు ఇస్రో సంస్థ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ.. ఇంతవరకు వాటి నుంచి ఎలాంటి స్పందన లేదు. నిజానికి.. సెప్టెంబర్ 22వ తేదీన చంద్రునిపై సూర్యకిరణాలు పడిన తర్వాత, సోలార్ ప్యానెల్స్ ద్వారా ఆ శక్తిని గ్రహించి, ఆ రెండు పరికరాలు తిరిగి మేలుకుంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. కానీ.. రోజులు గడుస్తున్నా ఫలితాలు రాకపోవడంతో, అవి తిరిగి మేలుకుంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. బహుశా.. చంద్రయాన్-3లోని పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులకు తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.నిజానికి.. ఈ చంద్రయాన్-3 మిషన్‌ని ఒక లూనార్ డే (భూమిపై 14 రోజులకు సమానం) మాత్రమే పని చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే.. చంద్రుని ఉపరితలంపై కాలుమోపిన తర్వాత ల్యాండర్, రోవర్‌తో పాటు ఇతర పేలోడ్స్ 10 రోజుల్లోనే తమ లక్ష్యాన్ని పూర్తి చేశాయి. చంద్రునిపై పరిశోధనలు జరిపి, ఎంతో కీలకమైన సమాచారాలను భూమికి అందజేశాయి. దీంతో.. ఈ మిషన్ జీవితాకాలాన్ని పొడిగించేందుకు ఇస్రో ప్రయత్నించింది. చంద్రునిపై సూర్యాస్తమయానికి ముందే.. పరికరాల కార్యకలాపాలను మూసివేసి, స్లీప్ మోడ్‌లోకి పంపించేశారు. చంద్రునిపై తిరిగి సూర్యకాంతి పడినప్పుడు.. దక్షిణ ధ్రువంలో ఉన్న ల్యాండర్, రోవర్‌లు ఆ శక్తిని గ్రహించి, తిరిగి మేల్కొలపవచ్చని ఇస్రో సంస్థ భావించింది. కానీ.. ఈ ప్రణాళిక అనుకున్న రీతిలో వర్కౌట్ అవ్వలేదు. ల్యాండర్, రోవర్ తిరిగి నిద్రావస్థ నుంచి బయటకు రాలేదు.ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. చంద్రునిపై రాత్రివేళ అతిశీతల (మైనస్ 200 డిగ్రీల కన్నా ఎక్కువగా) ఉష్ణోగ్రత ఉంటుంది. అంతటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా ల్యాండర్, రోవర్‌లోని పరికరాలను రూపొందించలేదు. దీంతో.. అవి పూర్తిగా గడ్డకట్టుకుపోయి, నాశనం అయ్యుండొచ్చు. ఈ అంశంపై ఇస్రో మాజీ చీఫ్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ గంటకు ల్యాండర్, రోవర్‌లు తిరిగి మేలుకుంటాయన్న ఆశలు మసకబారుతున్నాయన్నారు. బహుశా ఈ మిషన్‌లోని చాలా బాగాలు చంద్రునిపై తీవ్రమైన చలికి తట్టుకోలేక నాశనమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ చంద్రయాన్-3 మేల్కోకపోయినా.. ఇది అఖండ విజయం సాధించిందని తెలిపారు. కాగా.. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

Leave A Reply

Your email address will not be published.