భారత్ కు వెన్నెముక’గా ..అన్నదాతకు భరోసాగా..

-   తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయరంగ ప్రాధాన్యత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ బడ్జెట్ లో రూ.26,831 కోట్లను వ్యవసాయరంగానికి కేటాయించడమే కాకుండా రైతు రుణ మాఫీ కోసం 6,385 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. స్వరాష్ట్రం సాధించేనాటికి అస్తవ్యస్థంగా ఉన్న తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దశలవారీగా స్థిరత్వం వైపుగా తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే. నాడు కుదేలైన వ్యవసాయ రంగం, అప్పులకుప్పలో రైతాంగం, కష్టాలు, కన్నీళ్లు, ఆత్మహత్యలతో అల్లల్లాడిన తెలంగాణ వ్యవసాయరంగాన్ని అతి స్వల్ప కాలంలోనే దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చి, దేశానికి అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన గొప్ప కృషీవలుడు సీఎం కేసీఆర్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అప్పటి సమైక్య ప్రభుత్వాలు పదేండ్లలో కేవలం రూ.7,994 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశాయి. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు బాగుంటేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి రైతుల పక్షపాతిగా, రైతు జెండాను భుజాన వేసుకొని తెలంగాణ వ్యవసాయరంగానికి బడ్జెట్ లో ఏడాదికేడాది నిధులను పెంచుకుంటూ వెళుతూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జనవరి, 2023 వరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ మొత్తం ఉమ్మడి ఏపీలో కంటే 20 రెట్లు అధికం కావడం విశేషం.యావత్ భారత దేశంలోనే ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిస్తున్నారు. వారి కోసం అనేక సృజనాత్మక పథకాలను అందిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తారణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు లాంటి అద్భుతమైన పథకాలను అమలుచేస్తూ వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకొచ్చారు. దుక్కి దున్నడం మొదలు.. పండించిన ప్రతిగింజనూ  కొనుగోలు చేసేదాకా తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా రైతన్నలకు కొండంత అండగా నిలుస్తున్నది. దేశంలో రైతన్నలకు చార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటినీ అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం మన తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం. ఇలాంటి అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో నేడు దేశ వ్యవసాయ వృద్ధిరేటు (4 శాతం) కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు (7.4 శాతం) దాదాపు రెండు రెట్లు అధికంగా ఉండటం ప్రతి రైతుకూ గర్వకారణం.తెలంగాణలో 2014-15 ఏడాదికి గాను మొత్తం పంట సాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు కాగా, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న వ్యవసాయ అభివృద్ధి చర్యలతో 2020-21 నాటికి పంట సాగు విస్తీర్ణం 215.37 లక్షల ఎకరాలకు చేరుకున్నది. తెలంగాణలో వరి ఉత్పత్తి 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల ఉండగా 2021-22లో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం మామూలు విషయం కాదు. అంటే తెలంగాణలో వరి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది.‘‘ఒకప్పుడు బియ్యపు అన్నం అంటే తెల్వనోళ్లని వెటకారంగా పిలువబడ్డ తెలంగాణోళ్లు’’..నేడు భారత దేశానికే అన్నం పెట్టే రైతుబిడ్డలుగా కొనియాడబడటం వెనుక ఉద్యమనాయకుడు, సృజనాత్మక సంస్కరణశీలి, స్వయంకృషీవలుడు అయిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యొక్క చిత్తశుద్ధి, వెలకట్టలేని త్యాగనిరతి ఉంది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన అద్భుతమైన వ్యవసాయ పథకాలు భవిష్యత్ భారత దేశంలోనూ అంతులేని ‘బంగారపు నిధి’గా ఉపయోగపడుతూ ప్రజలకు ఎంతో భద్రత, రక్షణలను కల్పిస్తూ, సామాజిక శ్రేయస్సుకు ఎనలేని ప్రయోజనాలను ఒనగూరుస్తాయి. జై తెలంగాణ! జై భారత్!!.

              (-భారత సుదర్శన్విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్)

Leave A Reply

Your email address will not be published.