సినిమా స్టైల్లో ఏటిఎం చోరీకి యత్నం

- పోలీసుల రాకతో డబ్బు వదిలేసి పరారైన దొంగలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏటీఎంలో డబ్బుల చోరీకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, దొంగలు దోచుకున్న డబ్బును రోడ్డుపై విసిరి పారిపోతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల పట్టణంలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిందితులు ఏటీఎం ధ్వంసం చేసి అందులోని రూ. 19లక్షలతో పరారయ్యే సమయానికి పోలీసులు అక్కడకు చేరుకోవడంతో దొంగలు నగదు అక్కడే పడేసి పారిపోయారు.

కోరుట్ల పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి కోరుట్ల వేములవాడ రహదారిలోని పోలీసుస్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న తాండ్ర్యాల్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఏటీఎంలో నలుగురు దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ ను కట్ చేసి అందులో ఉంచిన లక్షల రూపాయలను బ్యాగ్ లో నింపారు. బ్యాగు కారులో పెట్టుకుని పరార్‌ అయ్యేందుకు సిద్ధమవుతుండగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అక్కడకు చేరుకుని నిందితుల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఓ దొంగ వాహనం ఎక్కే ప్రయత్నంలో కింద పడ్డాడు. అతడితో పాటు డబ్బులు కూడా కింద పడ్డాయి. దీంతో కరెన్సీ నోట్లు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ బృందం 30 సెకన్లు ఆలస్యం చేసి ఉంటే, దొంగలు అక్కడి నుంచి తప్పించుకునేవారని ఎస్పీ సింధు శర్మ చెప్పారు. ఏటీఎంలో అలారం సిస్టమ్ అమర్చారని.. ఇది సమీప పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించారని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.