బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి

కాంగ్రెస్‌ను బతిమాలుకుంటున్న వామపక్ష పార్టీలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి అంటూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ను బతిమాలుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలనుకున్న వామపక్షాల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా తయారయ్యింది. తమకు బలమున్న స్థానాలను కేటాయించాలని వామపక్షాలు కోరుతుండగా..అవి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్‌ తేల్చిచెప్తున్నది. బీఆర్‌ఎస్‌తో విభేదించిన లెఫ్ట్‌ పార్టీలు కాంగ్రెస్‌ కూడా దగ్గరికి రానివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్న సందిగ్ధంలో పడిపోయాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో కలిసి ఉన్నందున జాతీయ నాయకత్వం నుంచి ఒత్తిడి తెచ్చి కావాల్సిన స్థానాలు దక్కించుకోవాలనుకున్న వామపక్షాలకు కాంగ్రెస్‌ స్థానిక నాయకత్వం తీరు మింగుడుపడటం లేదు.సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై.. తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల జాబితాను అందించారు. కమ్యూనిస్టులు కోరుతున్న స్థానాలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న నేతలకు హామీ ఇచ్చామని, మరికొన్ని తమ సిట్టింగ్‌ సీట్లనీ, మరి కొన్నింటిలో తాము బలంగా ఉన్నామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. తాము అడిగిన సీట్ల కోసం మరో దశ చర్చలు జరుపుతాం అని లెఫ్ట్‌ పార్టీల నేతలు చెప్పడం వారి దీనావస్థకు అద్దం పడుతున్నది. లెఫ్ట్‌ పార్టీలకు చెరో రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్‌ అంటున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.