రికార్డులు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.2 లక్షల 40 వేలు అధికం కావడం విశేషం. 2022లో రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు.బాలాపూర్‌ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 36 మంది వేలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు. 1980లో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటయింది. 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. తొలి ఏడాది రూ.450కి లడ్డూ పాటలో దక్కించుకోగా 2017లో రూ.15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రద్దయింది.గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట గణనాథుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలతోపాటు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటున్నది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.1,04,97,970 ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటి తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.