తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్న బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించిన మరుక్షణం నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.! ఎందుకంటే.. ఎక్కడో ఉన్న బీజేపీ బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చిదంటే ఇందుకు కర్త, కర్మ, క్రియ బండి సంజయ్.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే.!. ఇంత చేసిన బండికి అగ్రనాయకత్వం ఇచ్చిన బహుమానం ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి తొలగించడం!. పోనీ.. రాష్ట్రంలో కమలం వికసించడానికి అహర్నిశలు శ్రమించిన బండికి ఏమైనా కీలక పదవి ఏమైనా కట్టబెట్టారా..? అంటే అదీ లేదు. గత వారం రోజులుగా అదిగో పదవి.. ఇదిగో పదవి అంటున్నారే తప్ప ప్రకటన వచ్చిందీ లేదు.. బండి కూల్ అయ్యిందీ లేదు.! అసలు పదవి వస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇవన్నీ అటుంచితే ఇప్పుడు సరికొత్త డిమాండ్‌ తెరపైకి వచ్చింది..

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బండిని అధ్యక్షుడిగా తొలగిస్తారని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో.! అయితే సడన్‌గా ఇలా జరగడంతో బండి సంజయ్, ఆయన వర్గం, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధ్యక్షుడి మార్పును నిరసిస్తూ ఇప్పటికే ఒకరిద్దరు ఆత్మహత్యకుయత్నించడం.. ఇంకొందరు రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆయన్ను ఎందుకు మార్చారు..? ఎవరి మెప్పుకోసం మార్చారు..? అసలు ఢిల్లీ వేదికగా ఏం జరిగిందనేది ఇక్కడ అప్రస్తుతం. అయ్యిందేదో అయిపోయింది.. ఇప్పుడు బండిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్న. పోనీ ఇస్తే కేంద్ర మంత్రి పదవే ఇస్తారా లేకుంటే సహాయక మంత్రి పదవి ఇస్తారా..? అనేది తెలియట్లేదు. వాస్తవానికి అధ్యక్షుడిగా తొలగించాక.. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలున్నాయని ఢిల్లీ నుంచి లీకులు వచ్చాయి. రెండ్రోజులపాటు ఢిల్లీలోనే బండి మకాం కూడా వేశారు కానీ.. ఇదంతా జరిగి రెండు, మూడ్రోజులు అవుతున్నా ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం.. పదవి కాదు కదా కనీసం పలకరించే పరిస్థితిలో అధిష్టానం ఉండటంతో బండి, ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతోందట.

తమ అభిమాన నేతకు కచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని వీరాభిమానులు, అనుచరులు డిమాండ్, బండి వర్గం డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా బండి పదవి కోసం పెద్ద ట్రెండ్‌నే అభిమాన వర్గం సెట్ చేస్తోంది. బండి ఢిల్లీలో ఎదురుచూపులు చూసి.. చూసి హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుదామనుకునే టైమ్‌లో కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ నుంచి పిలుపువచ్చింది. ఈ ఇద్దరి భేటీతో.. రైల్వే సహాయక మంత్రి పదవి ఇస్తారని టాక్ నడిచింది. అయితే సహాయక మంత్రి పదవి అస్సలు అక్కర్లేదని.. కచ్చితంగా మంత్రి పదవే ఇచ్చితీరాల్సిందేనని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సంజయ్ అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు.. బండి సంజయ్ పోస్ట్ కిషన్ రెడ్డికి ఇచ్చినప్పుడు.. కిషన్‌కు ఉన్న కేంద్రమంత్రి బండికి ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల కోరిక ఏ మేరకు నెరవేరుతుందో మరి. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాగా.. జూలై-09 తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇందుకోసం రెండు మూడ్రోజులుగా మోదీ నివాసంలో బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ తీవ్ర కసరత్తు కూడా జరుగుతోంది. జూలై-11 తర్వాత ఏ రాష్ట్రం నుంచి ఎవర్ని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే తెలంగాణ నుంచి బండికి ఏం పదవి ఇస్తారు..? ఒకవేళ పదవి ఇస్తే సహాయక శాఖ మంత్రి ఇస్తారా లేకుంటే పూర్తిగా ఏదైనా శాఖను అప్పగిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సహాయక మంత్రి పదవి ఇస్తే బండి సంజయ్ స్వీకరించే పరిస్థితుల్లో ఉన్నారా..? లేదా..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో.. సంజయ్ శిబిరంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.