కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రస్థానం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈసారి మోదీ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు తగిన ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్‌ కుమార్‌కు కూడా మోదీ జట్టులో ఛాన్స్ దక్కింది. ఈ నేపథ్యంలో.. ఏబీవీపీ నాయకుడి నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఎదిగిన తీరును బీజేపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. బండి సంజయ్‌కు ఈ గౌరవం ఊరికే రాలేదు.. ఆయన రాజకీయ ప్రయాణం.. ప్రజా క్షేత్రంలో నిత్ర సంగ్రామంగానే సాగింది.
తెలంగాణ బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన బండి సంజయ్.. 1971 జులై 11న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించారు. సంజయ్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేసిన బండి సంజయ్‌.. చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పనిచేశారు.

అనంతరం.. ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్) కరీంనగర్ పట్టణ కన్వీనర్‌గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బండి సంజయ్ బాధ్యతలు నిర్వర్తించారు. 1994-2003 మధ్యకాలంలో “ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌” డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. బీజేపీలో వివిధ హోదాల్లో సంజయ్ పని చేశారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇంఛార్జ్‌గానూ పని చేశారు. ఎల్‌కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ భాగం పంచుకున్న సంజయ్.. 35 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు.

2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బండి సంజయ్ తొలి విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన సంజయ్.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.వినోద్‌ కుమార్‌పై 89,508 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. రెండుసార్లు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంజయ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 3163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ మూడుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో బండి సంజయ్ ఓడిపోయారు.

తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. బీసీలను ఆకర్షించే వ్యూహంలో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌ను 2020 మార్చిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. “ప్రజా సంగ్రామ యాత్ర” పేరిట బండి సంజయ్ విడతల వారీగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, ప్రజలతో మమేకమయ్యారు

Leave A Reply

Your email address will not be published.