అంతరిక్షం నుండి బిఫోర్ జాయ్ తుఫాను

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను బిపొర్‌జాయ్ ( (Cyclone Biparjoy) గుజరాత్ వద్ద ఈ సాయంత్రం (జూన్ 15న) తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో అంతరిక్షం నుంచి తుఫానుకు సంబంధించిన ఫోటోలను ఓ వ్యోమగామి తీసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కు చెందిన వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాది అరేబియా సముద్రం మీదుగా కొనసాగుతోన్న బిపొర్‌జాయ్ తుఫాను ఫోటోలను తీశారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేస్తూ… వాటిని రెండు రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసినట్టు తెలిపారు.‘నా మునుపటి వీడియోలో చెప్పినట్టు అరేబియా సముద్రంలో ఏర్పడిన Biparjoy తుఫానుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.. నేను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రెండు రోజుల పాటు వీటిని తీశాను’ అని అల్ నెయాది పేర్కొన్నారు. రెండు రోజుల కిందట అల్ నెయాది ఓ వీడియోను షేర్ చేస్తూ.. అరేబియా సముద్రంలో భారీ తుపాను ఏర్పడి భారత తీరం వైపు మళ్లింది అని వివరించారు.‘నేను క్లిక్ చేసిన ఈ వీడియోలో అరేబియా సముద్రం మీదుగా ఉష్ణమండల తుఫాను ఎలా ఏర్పడుతుందో చూడండి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేక సహజ దృగ్విషయాలపై ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తుంది.. ఇది వాతావరణ పర్యవేక్షణలో భూమిపై నిపుణులకు సహాయపడుతుంది. అందరూ సురక్షితంగా ఉండండి’ అని అన్నారు.మరోవైపు, అత్యంత భీకరంగా మారిన బిపోర్ జాయ్ గురువారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత తీరాన్ని దాటనుంది. కచ్‌ సమీపంలోని మాండ్వి-పాక్‌లోని జఖౌ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తుఫాను తీరం దాటేవేళ గంటకు 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని హెచ్చరించింది. దీని ప్రభావంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో సాయంత్రం వరకు సముద్రం కల్లోలంగా ఉండనుంది.ఇక తుపాను తీవ్రత దృష్ట్యా సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఆలయాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే 94 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు

Leave A Reply

Your email address will not be published.