రష్యా  అణ్వాయుధాలను దాచి పెట్టే క్షేత్రం గా బెలారస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాది దాటిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్ యుద్ధం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో వరుస విజయాలతో ఉక్రెయిన్ లో కీలక నగరాలను ప్రాంతాలను చేజిక్కించుకుంటూ రష్యా ముందుకు దూసుకుపోయింది. కొద్ది రోజుల్లోనే ఆ దేశాన్ని చాపచుట్టేసేలా కనిపించింది.
అయితే ఉక్రెయిన్.. అమెరికా బ్రిటన్ తదితర దేశాలు అందిస్తున్న ఆయుధాలతో రష్యాపై పోరాటం సాగిస్తోంది. రష్యా తమ నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది.ఈ నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా మిత్ర దేశం బెలారస్ లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించాలని నిర్ణయించారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్దతుగా నిలిచిన ఏకైక దేశం బెలారస్ కావడం గమనార్హం. రష్యన్ బలగాలకు బెలారస్ పూర్తి స్థాయిలో సహకారమందిస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ పై దాడికి బెలారస్ ను స్థావరంగా వాడుకోవడానికి బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో రష్యాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తమకు లొంగకపోతే ఆ దేశంపై అణ్వాయుధాల ప్రయోగానికి వెనుకాడబోమని పుతిన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగానూ పుతిన్ అణ్వస్త్ర ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.రష్యా మిత్రదేశమైన బెలారస్ లో వ్యూహాత్మక అణ్వాయుధాలను దాచి పెట్టే యూనిట్ల నిర్మాణం జులై నాటికి పూర్తవుతుందని పుతిన్ వెల్లడించారు. సంప్రదాయ ఆయుధాలు సహా అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఇస్కందర్’ అనే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను ఇప్పటికే బెలారస్కు పంపించామని ఆయన తెలిపారు. ఐరోపాలోని పలు దేశాల్లో అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి ఇప్పటికే అణ్వాయుధాలను మోహరించిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గానే పుతిన్ తాజాగా ఈ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే అణ్వస్త్రాలను బెలారస్ లో మోహరించినప్పటికీ వాటిని నియంత్రించే అధికారాన్ని మాత్రం బెలారస్కు బదిలీ చేయబోమని పుతిన్ తెలిపారు. అలాగే అణు నిరాయుధీకరణ నిబంధనలను కూడా తాము ఉల్లంఘించబోమని వెల్లడించారు.అణ్వస్త్రాల మోహరింపును పుతిన్ సమర్థించుకున్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఈ విషయంలో ఎప్పటి నుంచో తమను అభ్యర్థిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆ దేశంలో అణ్వాయుధాలను  ఉంచాలని నిర్ణయించామన్నారు.అణ్వస్త్రాల మోహరింపు విషయంలో తమది అసాధారణమైన నిర్ణయం కాదన్నారు. అమెరికా ఇదే పనిని ఎన్నో ఏళ్లుగా చేస్తోందని పుతిన్ గుర్తు చేశారు. అమెరికా… ఐరోపాలోని ఆరు విభిన్న నాటో దేశాల్లో అణు ఆయుధాలను ఉంచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా లాగే తాము కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నామని పుతిన్ వెల్లడించారు. అయితే ఈ క్రమంలో తాము అణు నిరాయుధీకరణ ఒప్పందాలను ఉల్లంఘించడం లేదని పుతిన్ తెలిపారు.  పాశ్చాత్య దేశాలే ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. వివిధ దేశాలు ప్రజల భవిష్యత్తో ఆడుకుంటున్నాయని ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.