ఏపీ పోలీస్ శాఖలో బిగ్ ఫైట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఏపీ పోలీస్ శాఖలో బిగ్ ఫైట్ నడుస్తోంది. ఒకు పోలీస్ బాస్.. ఇంకొకరు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్ఆర్ ఆంజనేయులు తన పరిధి దాటి వ్యవహరిస్తుండడంతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడుతున్నారు. ప్రభుత్వ అధినేతకు రెండు కళ్లలా ఉండే ఈ ఇద్దరు ఐపీఎస్‌లు పోలీసుశాఖపై పూర్తిస్థాయి పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశం అయ్యాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా పోలీసు దళాల అధిపతితో పాటు నిఘా విభాగం అధిపతి అక్కడి ప్రభుత్వాలకు కీలకం. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతోంది.. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో.. సమాచారం సేకరించి నిఘావిభాగం అప్రమత్తం చేస్తే అందుకు అనుగుణంగా చట్టపరమైన చర్యలకు పోలీసులు ఉపక్రమించి శాంతి భద్రతలు పరిరక్షిస్తారు. అంతేగాక ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతారు. ఈ రెండు కీలక పోస్టుల్లో ఉండే ఐపీఎస్ అధికారుల మధ్య సఖ్యత లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అందుకే డీజీపీ ర్యాంకు అధికారి ఉంటే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అడిషనల్ డీజీ కేడర్ ఐపీఎస్ ఉంటారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఆ రెండు పోస్టుల్లోనూ డీజీ ర్యాంకు అధికారులే ఉండటంతో ఆదిపత్య పోరు మొదలైంది. అది కూడా ఒకే బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లు కావడంతో మరింత ముదురుతోంది.ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన అడిషనల్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని మూడేళ్ల క్రితం నిఘా విభాగం అధిపతిగా నియమించిన జగన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో డీజీపీగా పదోన్నతి కల్పించి ఏసీబీ డీజీగా నియమించింది. తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటారని ఫిబ్రవరి మూడో వారంలో పోలీస్ బాస్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటిదాకా ఏసీబీ డీజీగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేసిన వైసీపీ ప్రభుత్వం ఇద్దరు అధికారులతో కీలకంగా పని చేయించుకుంటోంది. సౌమ్యంగా కనిపించే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ పెద్ద వద్ద తలూపినా పోలీసింగ్‌లో మరీ ఏకపక్షంగా కాకుండా పద్ధతిగానే పనిచేస్తున్నారు. కోనసీమలో కొట్లాటలు జరిగినా.. ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు పిలుపిచ్చినా.. అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టినా.. గతంతో పోలిస్తే మెరుగ్గానే వ్యవహరించారు. ఇది ప్రభుత్వ పెద్దలకు రుచించలేదో ఏమో కానీ పోలీస్ బాస్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించి పది నెలలు కావస్తున్నా ఎఫ్ఎసీగానే కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.