బిజెపి, తెరాస లు నాటకాలాడుతున్నాయి

.. రాహుల్ గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: షాద్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని.. ప్రభుత్వం, నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఐదోరోజు ఉత్సాహంగా సాగింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం షాద్‌నగర్‌లో ముగిసింది. షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. నల్లచట్టాలతో పాటు పార్లమెంట్‌ భాజపా ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. భాజపా, టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. మోదీ పాలన వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయని, గ్యాస్‌సిలిండర్‌ ధర రూ.100 దాటినా మోదీ మాట్లాడటంలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, చిన్న వ్యాపారులకు అనేక రకాలుగా మేలు చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.