కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అధికారులకు బాంబు హెచ్చరిక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  రాత్రి 11:30 గంటల సమయంలో వచ్చిన ఈ ఫోన్ కాల్ తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. రాజ్ భవన్ ఆవరణపై బాంబులు వేస్తానని అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. బాంబును వెతికేందుకు తక్షణం రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో ఘటనా స్థలంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్ భవన్ మైదానంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఫోన్ కాల్ ముప్పు విశ్వసనీయతను తెలుసుకునేందుకు, ఆ ప్రాంత భద్రతను నిర్ధారించడానికి సమగ్ర తనిఖీని కొనసాగించారు. అయితే బాంబు హెచ్చరిక చేసిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేసే పనిలో అధికారులు చురుగ్గా నిమగ్నమయ్యారు. కాగా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను టార్గెట్ గా చేసుకొని దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. రాజ్ భవన్ లో బాంబు పెట్టినట్టు ఆ సంస్థ అధికారులకే ఫోన్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ అధికారులు బెంగళూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ డివిజన్ పోలీసులు విధానసౌధ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.