ఏపి లో బిఅర్ఎస్ పార్టీ …ఆ ఇద్దరూ…

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు తెలంగాణ సీఎం కేసీఆర్ కే ఉన్నాయన్నారు. మతతత్వ బీజేపీని అడ్డుకునే సత్తా సీఎం కేసీఆర్ కే ఉందన్నారు.
ఈ మేరకు ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో తెలుగువారికి సగర్వ వేదికగా బీఆర్ఎస్ భవన్ నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ మోడల్ను దేశమంతా విస్తరించాలని ప్రజలు ఆశిస్తున్నారని వెల్లడించారు. దేశంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని ఆయన ఆకాంక్షించారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ టీడీపీలకు ధీటుగా బీఆర్ఎస్ తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాల పనితీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మోడీ పాలనను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలను ఐటీ ఈడీ సీబీఐ వ్యవస్థలతో బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ పోలవరం వంటి అనేక హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తోట చంద్రశేఖర్ తెలిపారు. ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతుందని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు నింగినంటాయని గుర్తు చేశారు. ఫలితంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్లల్లో తెలంగాణలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ఏపీలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదన్నారు.కాగా 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని చంద్రశేఖర్ చెబుతుండటంపై సెటైర్లు పడుతున్నాయి. ఆలూ లేదు.. చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చంద్రశేఖర్ తీరు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క నియోజకవర్గానికి కూడా బీఆర్ఎస్ ఇంచార్జి లేరని అంటున్నారు. బీఆర్ఎస్ లో ఇప్పటివరకు ఏపీ నుంచి చేరింది తోట చంద్రశేఖర్ రావెల కిశోర్ బాబేనని చెబుతున్నారు. వీరు కూడా అన్ని పార్టీలు తిరిగొచ్చి ఇక చేరడానికి ఏ పార్టీలేక కేసీఆర్ తాయిలాలకు ఆశపడే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు.ఇప్పటివర కు బీఆర్ఎస్ ఏపీలో ఒక్క సభ కూడా నిర్వహించలేదని.. పేరున్న ఒక్క నేత కూడా ఆ పార్టీలో చేరలేదని గుర్తు చేస్తున్నారు. మరి 175 స్థానాల్లో పోటీ చేయడానికి అసలు అభ్యర్థులు ఎక్కడ  ఉన్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.