వన్డే ప్రపంచకప్‌ వైస్‌ కెప్టెన్‌గా బుమ్రా!!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వన్డే ప్రపంచకప్‌ స్వదేశంలో జరగనుండగా..టీమ్‌ ఇండియా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. మెగాటోర్నీకి ముందు ఆసియాకప్‌ జరుగనుండగా.. దీని కోసం ఢిల్లీలో సెలెక్షన్‌ కమిటీ సమావేశం కాబోతున్నది. అజిత్‌ అగార్కర్‌ నేతృతవలోని కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. దీనికి భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఆసియా కప్‌ కోసం 17 మందితో కూడిన జట్టును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. దాదాపు అదే టీమ్‌ను వన్డే వరల్డ్‌కప్‌నకు కూడా ఎంపిక చేయడం దాదాపు ఖాయమే. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రస్తుతం రోహిత్‌ డిప్యూటీగా హార్దిక్‌ పాండ్యా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనలో పాండ్యా సారథ్యంలోని టీమ్‌ఇండియా 2-3తో టీ20 సిరీస్‌ కోల్పోయింది. ఈ ఓటమికి పాండ్యా కెప్టెన్సీ కూడా ఒక కారణమని మేనేజ్‌మెంట్‌ బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో అతడిని వైస్‌ కెప్టెన్సీసి నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ద్వారా పునరాగమనం చేసిన ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు ఆ బాధ్యతలు అప్పగించే చాన్స్‌లు ఉన్నాయి. ‘కెప్టెన్సీ విషయంలో అనుభవం పరంగా చూసుకుంటే.. పాండ్యా కంటే బుమ్రానే ముందుంటాడు. 2022లోనే టెస్టు జట్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. పాండ్యా కంటే ముందు బుమ్రా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ భారత వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ కారణంగా ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్‌నకు బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైతే ఆశ్చర్యపోనవసరం లేదు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.