బస్సుకు మంటలు అంటుకొని 25 మంది సజీవ దహనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) పెను విషాదాన్ని నింపింది. నాగ్‌పూర్ (Nagpur) నుంచి పుణేకు (Pune) వెళ్తున్న విదర్బ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని 25 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే, ప్రమాద సమయానికి చాలామంది గాఢనిద్రలో ఉండటం వల్ల బస్సుకు అంటుకున్న మంటల్లో వారంతా కాలిబూడిదయ్యారు. మొత్తం బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొందరు బస్సు కిటికీలు పగలగొట్టి బయటపడి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇలా బయటపడిన బాధితుడు మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరు వివరించాడు.‘‘భారీ శబ్దంతో టైరు పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడింది.. దాంతో డీజిల్ ట్యాంకు పగిలిపోయి అందులో నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల క్షణాల్లో బస్సు అంతా మంటలు వ్యాపించాయి. వెనుకవైపు కిటికీలు బద్దలుకొట్టి నా తోటి ప్రయాణికుడు, నేను బయటపడ్డాం’’ అని అతడు వెల్లడించాడు.ఈ ప్రమాదం గురించి స్థానికుడొకరు మాట్లాడుతూ.. కిటికీ అద్దాలు పగలగొట్టి నలుగురైదుగురు బయటపడినా.. అందరూ అలా బయటపడలేకపోయారని చెప్పారు. తరుచూ ఈ మార్గంలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి చెప్పారు.‘‘సాయం కోసం బస్సులో ఉన్నవాళ్లు మమ్మల్ని పిలిచారు. అయితే మేం వెళ్లేసరికే అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. టైర్లు విరిగి దూరంగా పడి ఉన్నాయి. బస్సు లోపల ఉన్నవారు అద్దాలు పగలకొట్టేందుకు ప్రయత్నించారు.. కానీ సాధ్యం కాలేదు.. సాయం కోసం అర్థిస్తూనే మా కళ్లముందే అగ్నికి ఆహుతయ్యారు.. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మేం ముందుకు వెళ్లలేకపోయాం. వారి పరిస్థితి చూసి మాకు కన్నీరాగలేదు’’ అని ఆవేదన చెందారు.ప్రమాదం జరిగిన తర్వాత అటుగా వెళ్తున్న వాహనదారులు ఎవరూ స్పందించలేదని, లేకపోతే మరింత మంది ప్రాణాలతో బయటపడేవారి వాపోయాడు. ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వేగంగానే వచ్చారని ఓ ప్రయాణికుడు తెలిపారు. ప్రమాదం నుంచి 10 మంది గాయాలతో బయటపడగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా.. అదృష్టవశాత్తూ ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. తన సీటు పక్కన కిటీకి పగలుగొట్టి బయటకు వచ్చేశాడు. ప్రమాద స్థలిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు పరిశీలించనున్నారు. మరోవైపు, బస్సులో నుంచి మృతదేహాలను బయటకు తీయడం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.