కోడి కత్తి కేసులో విచారణకు రాలేను

- ఎన్ఐఏ కోర్టుకు జగన్ చెప్పిన కారణం ఏంటంటే..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ ఎయిర్‌పోర్టు కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్మోహన్‌రెడ్డి తరపున రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. సీఎం జగన్‌కు వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని లాయర్‌ వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కోడి కత్తి ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని.. దీనిపై ఎన్ఐఏ సమగ్ర విచారణ జరపాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. కోడి కత్తి శ్రీనుపై స్వగ్రామంలో 2017లో కేసు ఉందని న్యాయస్థానానికి లాయర్‌ వెంకటేశ్వర్లు తెలియజేశారు.స్వయంగా విచారణకు హాజరుకావాలంటూ సీఎం జగన్‌కు గత వాయిదాలో మెజిస్ట్రేట్ సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ తరుపున లాయర్ రెండు పిటిషన్లు వేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో ముఖ్యమంత్రి కోరారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందని.. పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉందని పిటిషన్‌లో జగన్ పొందిపరిచారు. అలాగే కోర్టుకు సీఎం హోదాలో హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నారు. అందుకే అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి ఆయన సాక్ష్యంలో నమోదు చేయాలని పిటిషన్‌లో జగన్ కోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును కూడా మరింత లోతుగా జరపాలంటూ మరో పిటిషన్ కూడా జగన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై గురువారం (ఏప్రిల్ 13)న విచారణ జరుపుతామని ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది.

2018 అక్టోబరులో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణకు బాధితుడిగానే గాక సాక్షిగా ఉన్న జగన్ కూడా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని కోర్టును జగన్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.