ఎంపీ అవినాష్‌రెడ్డి కి రెండోసారి సీబీఐ నోటీసులు

- పాత్ర ఉందని తేలితే అరెస్ట్‌..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి కి రెండోసారి సీబీఐ నోటీసులిచ్చింది. ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ లోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో సీబీఊ పేర్కొంది. గతనెల 28న తొలిసారి సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. అవినాష్‌రెడ్డి మాట్లాడిన కాల్స్‌పై ఇప్పటికే సీబీఐ విచారించింది. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను చెరిపేశారనే అభియోగాలపై అవినాష్‌ను మరోసారి సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌, ఎర్ర గంగిరెడ్డి ద్వారా ఆధారాలను చెరిపేశారని అభియోగాలున్నాయి. వివేకాను హత్య చేస్తే రూ.40 కోట్ల ఆఫర్ చేశారని అభియోగం కూడా ఉంది. ఈ వ్యవహారంలో అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేయనుంది. అవినాష్‌రెడ్డి పాత్ర ఉందని తేలితే అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.కాగా అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా ప్రశ్నించారు. ఈ విచారణలో అధికారులు పదుల సంఖ్యలో అడిగిన ప్రశ్నల్లో చాలా వరకు ఆయన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో ఆధారాల ట్యాంపరింగ్‌, సాక్ష్యాల విధ్వంసంపైనే సీబీఐ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కేసు నమోదు తర్వాత సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో లభించిన ఆధారాలు, అంతకుముందే ‘సిట్‌’ పోలీసులు జరిపిన దర్యాప్తు ప్రాతిపదికన ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించుకున్నారు. వేకానంద రెడ్డి ఒంటిపై గొడ్డలిపోటు గాయాలు కనిపిస్తున్నా… గుండెపోటుతో మృతి చెందినట్లు ఎందుకు ప్రకటించారని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

దొంక లాగితే తీగ’ దొరికింది.. తాడేపల్లికి సెగ…

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక ‘తీగ’ దొరికింది. అది… తాడేపల్లికి ‘కనెక్ట్‌’ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. జగన్‌ బంధువు, మొదటి నుంచీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఈ గుట్టు రట్టయింది. ఈ తీగ ఆధారంగా డొంకను కదిలిస్తే… వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకోవడం ఖాయమని చెప్పొచ్చు. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన సొంత ఇంట్లో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు ఏం జరిగింది, రక్తపు మరకలు ఎందుకు చెరిపారు, గుండెపోటు కథ ఎందుకు అల్లారు… ఇలాంటి అనేక అంశాలపై అవినాశ్‌ రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణ ప్రక్రియలో ఆయన ‘కాల్‌ డేటా’ అత్యంత కీలకంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… సీబీఐ అధికారులు అడిగిన అనేక ప్రశ్నలకు అవినాష్ రెడ్డి పొడిపొడిగా సమాధానం చెప్పినా, కొన్నింటికి అసలే చెప్పకపోయినా… కాల్‌ లిస్ట్‌ విషయంలో మాత్రం తప్పించుకోలేకపోయారు.

Leave A Reply

Your email address will not be published.