అవినాష్‌పై సీబీఐ సీరియస్.. ఏ క్షణమైనా..!?

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో  సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మళ్లీ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికే ఆరుసార్లు అవినాష్ రెడ్డిని విచారించగా.. మరో రెండుసార్లు విచారణకు చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ వేదికగా అవినాష్ విషయం పెద్ద హైడ్రామానే నడిచింది. విచారణకు వస్తున్నట్లు సీబీఐకు సమాచారం ఇవ్వడం.. అధికారులంతా వేచి చూస్తుండటం.. మార్గమధ్యలోనే మళ్లీ హైదరాబాద్ నుంచి పులివెందులకు పయనమవ్వడం.. తన తల్లికి అనారోగ్యంగా ఉందని అత్యవసరంగా వెళ్తున్నట్లు సీబీఐకి లేఖ రాయడం.. రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని అవినాష్ తరఫు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అవినాష్ కాన్వాయ్‌ను హైదరాబాద్ నుంచే సీబీఐ బృందం ఫాలో అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అవినాష్‌ను సీబీఐ అధికారులు వెంబడిస్తున్న పరిస్థితి..!. దీంతో ఏ క్షణమైనా అవినాష్‌ను అరెస్ట్ చేయొచ్చని అటు పులివెందులలో.. ఇటు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇక అరెస్టే..!

సరిగ్గా ఈ పరిస్థితుల్లో సీబీఐ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అవినాష్‌ను విచారణకు పిలిచినప్పుడు ఏం జరిగింది..? ఇవాళ ఉదయం నుంచి ఏం జరిగింది..? ఏం జరుగుతోంది..? అనే విషయాలను ఇక్కడి అధికారులు పూసగుచ్చినట్లుగా ఎప్పటికప్పుడు సీబీఐ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇక మీదట ఉపేక్షించే ప్రసక్తే లేదని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విచారణకు పిలిచిన ప్రతీసారి అవినాష్ డుమ్మా కొడుతుండటంతో ఇక విచారణ అనే మాటే లేకుండా నేరుగా అరెస్టే చేయాలని హెడ్ క్వార్టర్స్ నుంచి సీబీఐ అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అవినాష్ కాన్వాయ్‌ను ఫాలో అవుతున్న సీబీఐ బృందానికి కూడా క్లియర్‌కట్‌గా అరెస్ట్‌పై సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇల కీలక ఆదేశాలు వచ్చిన తర్వాతే అవినాష్‌ను మొదట్నుంచీ సీబీఐ బృందం ఫాలో అవుతున్నట్లుగా సమాచారం. సీబీఐ అధికారులు పదే పదే ఫోన్ చేసినా.. వెంబడిస్తున్నారని తెలుసుకున్న అవినాష్ కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదట. అయితే అవినాష్ వర్గం మాత్రం తల్లి అనారోగ్యంగా ఉందని.. ఆమెను చూడాలనే ఆందోళనలో ఆయన ఉన్నారని అందుకే ఎవ్వరు ఫోన్ చేసినా తీయట్లేదని చెబుతోంది. అవినాష్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని.. విచారణకు హాజరుకావాలనే హైదరాబాద్ వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. పులివెందులకు వెళ్లి అయినా సరే అవినాష్‌ను ఇవాళ అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సీబీఐ అధికారులు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave A Reply

Your email address will not be published.