జనాభా లెక్కలు మళ్ళి వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్ లో జనాభా లెక్కలు మరోసారి వాయిదా పడ్డాయి. రెండేళ్ల క్రితం జరగాల్సిన జన గణనను కరోనా కారణంగా వాయిదా వేసిన కేంద్రం.. ఈసారి బలమైన కారణాల్లేకుండా వాయిదా వేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ జన గణన చేసే అవకాశాల్లేవని తెలుస్తోంది. దీంతో కేంద్రం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై అసహనంగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరింత ఒత్తిడి పెంచేందుకు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టారు.

దేశవ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం 2021లో చేపట్టాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత కూడా పలు కారణాలతో జనాభా గణనను కేంద్రం వరుసగా వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి జనాభా లెక్కల్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ జనాభా లెక్కలు గణించే అవకాశాల్లేవని కేంద్ర ప్రభుత్వంలోని జనగణనశాఖ అధికారులు తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. జనాభా గణనకు ముందు దేశంలో చేపట్టే పాలనా సరిహద్దుల స్తంభన కార్యక్రమాన్ని జూన్ 30 వరకూ పొడిగించారు. అంటే ఇక్కడి నుంచి కనీసంమూడు నెలల పాటు జనాభా లెక్కలు చేపట్టే అవకాశాల్లేవని తేలిపోయింది. అంటే ఈ ఏడాది చివర్లో ప్రారంభమైనా వచ్చే ఏడాది ఎన్నికల వరకూ అది సాగే అవకాశాలుంటాయి. దీన్ని బట్టి చూస్తే కేంద్రం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా దేశవ్యాప్తంగా జనగణన షెడ్యూల్ ప్రకారం చేపట్టలేకపోవడం ఈ శతాబ్ధంన్నరలో ఇదే తొలిసారిగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2021లో జరగాల్సిన జనగణనను 2023లోకి అడుగుపెట్టినా ఇంకా నిర్వహించలేకపోవడం పాలనా లోపాల్ని, కేంద్ర ప్రభుత్వానికి ఈ విశిష్ట కార్యక్రమంపై ఉన్న చిత్తశుద్దిని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా జనగణన వాయిదా వేయడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ కరోనా తగ్గిన తర్వాత కూడా ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోవడం కేంద్రం పనితీరుకు నిదర్శనంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఓ వ్యూహంలో భాగమనే విమర్శలూ ఉన్నాయి.
జనాభా లెక్కలు షెడ్యూల్ ప్రకారం జరగకపోవడం అనేది దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారికి ఉద్దేశించిన పలు కార్యక్రమాలు, విధానాలు, ఆహార పంపిణీ, విద్య, వినియోగం, గృహాలు, కార్మికులపై సర్వే వంటి అంశాలపై ప్రభావం చూపబోతోంది. అందువల్ల జనాభా లెక్కల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాల్సి ఉంది. 2011 జనాభా లెక్కలు, 2021 జనాభా లెక్కలు అందుబాటులో లేనప్పుడు జనాభా అంచనాల పరిధిలోకి వచ్చే వ్యక్తులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలను పరిమితం చేయవద్దని జూలై 2022లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.