జాబిల్లి చెంతకు చేరిన చంద్రయాన్‌-3 స్పేస్‌ క్రాఫ్ట్‌

- ఎలా ల్యాండ్‌ అవుతుందనే దానిపైనే తీవ్ర ఉత్కంఠ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్‌ పంపిన చంద్రయాన్‌-3 స్పేస్‌ క్రాఫ్ట్‌ విజయవంతంగా జాబిల్లి చెంతకు చేరింది. ఇక ఇప్పుడు జాబిల్లిపై ఈ మూన్‌ మిషన్ ఎలా ల్యాండ్‌ అవుతుందనే దానిపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైనందున.. ఇప్పుడు అలాంటి చేదు అనుభవమే ఎదురవుతుందా..? లేదంటే చంద్రయాన్‌-1 మాదిరిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుందా..? ఇంతకూ ఏం జరుగనుంది అనే ఉత్కంఠ భారత శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజలను కూడా టెన్షన్‌ పెడుతున్నది.ఈ నేపథ్యంలో మూన్‌ మిషన్‌ ల్యాండింగ్‌ ఎలా జరుగుతుందనే విషయాన్ని బెంగళూరులోని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. రామాయణాన్ని ‘కట్టే కొట్టే తెచ్చే’ అని మూడు ముక్కల్లో చెప్పినట్టుగా ఈ చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ విషయాన్ని కూడా తెలియజేశారు. వారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చంద్రుడి సమీప కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 ఇస్రో సైంటిస్టుల ఆదేశాలకు అనుగుణంగా చందమామ ఉపరితలం వైపు ప్రయాణం మొదలు పెట్టి 20 నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుంది.ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు బెంగళూరులోని ‘ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC) చంద్రయాన్‌-3 మిషన్‌కు తన ఆదేశాలను చేరవేస్తుంది. ఆ వెంటనే మిషన్‌లోని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రయాన్‌ ఉపరితలం వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అయితే వేగం తగ్గించుకుని ల్యాండయ్యే సమయంలో మాత్రం.. ల్యాండర్‌ తనలోని సాంకేతిక వ్యవస్థ ఆధారంగా తనను తాను నియంత్రించుకుంటూ దిగుతుంది. తనలోని సెన్సార్స్‌ అందించే డాటా ఆధారంగా జాబిల్లిపై కాలు మోపడానికి అవసరమైన సర్దుబాట్లు, మార్పులు చేసుకుంటుంది. ఈ 20 నిమిషాల ప్రక్రియ సజావుగా సాగితే చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైనట్టే.

Leave A Reply

Your email address will not be published.