వాతావరణం లో మార్పులు 465 మంది మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అత్యధిక ఉష్ణోగ్రతలు, ఆ వెంటనే భారీ వర్షాలు, గడ్డకట్టే చలి.. ఇలా అన్ని సీజన్లు ఒకేసారి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇవన్నీ సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడం ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఎండలకు జనం పిట్టల్లా రాలిపోతుండగా.. మరోవైపు.. కుంభవృష్టి వానలకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక చలిగాలులు కూడా ప్రజల ప్రాణాలు తీస్తుండటంతో.. ఎలాంటి వాతావరణానికి తట్టుకోలేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక వాతావరణం కూడా ఒకపక్క భారీగా ఎండ, వేడిగాలులు నమోదు అవుతుండగా.. సమీపంలోనే భారీ వర్షాలు, వరదలు ఉప్పొంగుతున్నాయి.
పాకిస్తాన్‌లో ఎండలు
పాకిస్తాన్‌ ఆర్థిక రాజధాని అయిన కరాచీ నగరంలో గత కొన్ని రోజులుగా ఎండలు, వేడిగాలులు తీవ్రంగా నమోదవుతున్నాయి. హీట్‌వేవే కారణంగా 4 రోజుల్లోనే 450 మంది మరణించినట్లు స్థానిక ఎన్జీవో ఈదీ ఫౌండేషన్‌ బుధవారం ప్రకటించింది. కరాచీలో ఆదివారం నుంచి నిత్యం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రోడ్లపై జీవించేవారు.. డ్రగ్స్‌కు బానిసలు అయినవారే ఉన్నారని ఈదీ ఫౌండేషన్‌ తెలిపింది. ఈ ఘటనలతో కరాచీ నగరంలోని ఆస్పత్రుల్లోని మార్చురీలు మొత్తం మృతదేహాలతో నిండిపోయాయని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

నేపాల్‌లో భారీ వర్షాలు
ఒకవైపు పాకిస్తాన్‌లో ఎండ, హీట్‌వేవ్ భారీగా ఉండగా.. పక్కనే ఉన్న నేపాల్‌ మాత్రం భారీ వర్షాలు, పిడుగులతో అల్లాడిపోతోంది. 24 గంటల్లో నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు కారణంగా 14 మంది మృతి చెందారు. నేపాల్‌లో రుతుపవనాలు ప్రవేశించి 17 రోజులు అయిందని.. అప్పటినుంచి సంభవించిన పలు ప్రకృతి విపత్తుల కారణంగా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు 33 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.