త్వ‌ర‌లో పెరుగనున్న మొబైల్ ఫోన్ల ప్రీ-పెయిడ్ ప్లాన్ల చార్జీలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: త్వ‌ర‌లో మొబైల్ ఫోన్ల ప్రీ-పెయిడ్ ప్లాన్ల చార్జీల మోత మోగ‌నున్న‌ది. భార‌తీ ఎయిర్‌టెల్ చైర్మ‌న్ సునీల్ భార‌తి మిట్ట‌ల్ ఈ విష‌య‌మై సంకేతాలిచ్చారు. ఈ ఏడాది మ‌ధ్య‌లో అన్ని ప్రీ-పెయిడ్ ప్లాన్ల చార్జీలు పెంచే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని బార్సిలోనాలో జ‌రుగుతున్న మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ)లో చెప్పారు. త‌మ కంపెనీ భారీ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టింద‌న్నారు. కానీ టెలికం ప‌రిశ్ర‌మ‌లో పెట్టిన పెట్టుబ‌డుల‌కు చాలా త‌క్కువ రిట‌ర్న్స్ వ‌స్తున్నాయ‌న్నారు. దీన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కొద్ది మొత్తంలోనైనా చార్జీలు పెంచుతామ‌ని, ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దేందుకు స‌రైన రీతిలో టారిఫ్‌లు పెంచ‌డం త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు. ఆయా ప్లాన్ల‌పై టారిఫ్ ఎంత పెంచుతార‌న్న విష‌యమై సునీల్ భార‌తీ మిట్ట‌ల్‌ క్లారిటీ ఇవ్వ‌లేదు.ప్ర‌తి యూజ‌ర్‌పై స‌గ‌టు ఆదాయం అర్పు ప్ర‌స్తుతం రూ.193 మాత్ర‌మే ఉన్న‌ది. దీన్ని రూ.300ల‌కు పెంచాల‌ని ఎయిర్‌టెల్ కోరుతున్న‌ది. ప్ర‌తి నెలా యూజ‌ర్ నుంచి సంపాదిస్తున్న ఆదాయంలో స‌గ‌టు రెవెన్యూ..`అర్పు`. జ‌న‌వ‌రిలోనే క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, ప‌శ్చిమ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా దేశంలోని ఎనిమిది స‌ర్కిళ్ల ప‌రిధిలో ప్లాన్‌ల టారిఫ్‌లు ఎయిర్‌టెల్ పెంచేసింది. 28 రోజుల టారిఫ్ 57 శాతం పెంచి రూ.155 చేసింది. ఎనిమిది స‌ర్కిళ్ల ప‌రిధిలో క‌నీస రీచార్జి టారిఫ్ రూ.99 నిలిపేసింది. 200 ఎంబీ ఇంట‌ర్నెట్, కాల్స్‌లో సెక‌న్‌కు 2.5 పైస‌లు చార్జీని ఈ ప్లాన్ కింద వ‌సూలు చేస్తున్న‌ది.

మీడియాలో వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం దేశంలోని అన్ని స‌ర్కిళ్ల ప‌రిధిలో రూ.99 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ నిలిపివేయ‌నున్న‌ది. అదే జ‌రిగితే ఎస్సెమ్మెస్ సేవ‌లు యాక్టివ్‌గా కొన‌సాగించాల‌ని ప్ర‌తి ఎయిర్‌టెల్ యూజ‌ర్ క‌నీసం రూ.155 ప్లాన్ రీచార్జి చేసుకోవాల్సిందే.

దేశంలో ఎయిర్‌టెల్‌కు 36.7 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీగా ఎయిర్‌టెల్ ఉంది. రిల‌య‌న్స్ జియోకు 42.1 కోట్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా 24.1 కోట్లు, బీఎస్ఎన్ఎల్‌కు 10.6 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.