ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ధ్యాసంతా అవినాశ్‌రెడ్డిపైనే

-   తమ్ముడి కోసం పరిపాలన పక్కకు  - పెద్ద పెద్ద లాయర్లను రంగంలోకి దించినా సుప్రీంకోర్టులో చుక్కెదురు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ధ్యాసంతా తన తమ్ముడుకడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిపైనే ఉంది. తన చిన్నాన్నమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా నివారించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలివ్వడం లేదు. దివ్యశక్తులు ఉన్న స్వామీజీలు కమ్‌ లాబీయిస్టులను నమ్ముకున్నా ప్రయోజనం శూన్యం. తమ్ముడి కోసం పరిపాలనను పక్కనపెట్టారు. పెద్ద పెద్ద లాయర్లను రంగంలోకి దించినా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో జగన్‌ మానసికంగా అలజడికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఆయనకు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి బాగా వాడుకున్న కోడికత్తి కేసు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటోంది. ఈ దాడి కేసులో కుట్రకోణం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చేసింది.ఇదే సమయంలో వివేకానందరెడ్డి హత్యకేసులో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తు జరపాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టే సీబీఐని ఆదేశించింది. దీంతో దర్యాప్తు సంస్థ మరింత క్రియాశీలమై జగన్‌ మరో చిన్నాన్నఅవినాశ్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని.. అంతకుముందే ఆయనకు అత్యంత సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసింది. వివేకా హత్య తాలూకు ఆనవాళ్లు తుడిచేయడంలోగుండెపోటు కథ ప్రచారంలో వీరిద్దరితో పాటు అవినాశ్‌దే కీలక పాత్ర అని కోర్టుకు నివేదించింది. ఈ నెల 25వరకు అవినాశ్‌ను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లిన వివేకా కుమార్తె సునీతారెడ్డి.. అవినాశ్‌ పాత్రపై సీబీఐ చెప్పిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ముఖ్యమంత్రిని మరింత ఇరకాటంలో పడేశాయి. ఏ క్షణంలోనైనా అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆయన కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఆయనకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయని.. అవినాశ్‌ అరెస్టు జరిగితే వ్యక్తిగతంగానే గాక.. రాజకీయంగానూ తనకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సమీక్షలన్నీ అన్యమనస్కంగానే..!

తమ్ముడికి న్యాయ సహాయం అందించే క్రమంలో ఆయన పార్టీ కార్యకలాపాలనే కాదు.. ప్రభుత్వ పాలనను సైతం పక్కనపడేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయుతే పాలన పడకేసిన విషయం బయటకు పొక్కకుండా రోజూ వివిధ శాఖలపై సమీక్షలు జరుపుతున్నా.. అవన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయని.. సీఎం అన్యమనస్కంగా కనిపిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నిజానికి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన నాటి నుంచీ జగన్‌ ఇదే తీరున ఉన్నారని సన్నిహిత వర్గాలూ చెబుతున్నాయి. అవినాశ్‌రెడ్డిభాస్కర్‌రెడ్డిలను పార్టీ కాపాడుకుంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ప్రకటించినా.. ఇప్పుడు సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడం జగన్‌కు మింగుడుపడడం లేదని సమాచారం. ఉద్దండులైన సీనియర్‌ న్యాయవాదులనే కాదు.. పేరున్న లాబీయిస్టులనూ రంగంలోకి దించారు. జ్యోతిష్కుడు విజయకుమార్‌ను ఇటీవల మైసూరు నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ఐదారు గంటలపాటు ఆశీర్వచనాలు’ అందుకున్నారు. స్వామీజీలను సైతం ఆశ్రయించడం చూస్తే.. జగన్‌ ఆత్మస్థైర్యం బాగా దెబ్బతిన్నట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.వివేకా హత్య కేసు పరిణామాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వ పెద్దలు ఓ సర్వేను తెరపైకి తెచ్చారు. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రలో 25 లోక్‌సభ స్థానాలకు గాను వైసీపీకి 24-25 వస్తాయంటూ ఓ ఆంగ్ల చానల్‌ ఇటీవల సర్వే ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇమేజ్‌ పెంచుకునేందుకు ఆ చానల్‌తో కోట్లాది రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సదరు చానల్‌ ఈ సర్వేతో స్వామిభక్తి చాటుకుందని ప్రజలు కూడా గ్రహించారు.

Leave A Reply

Your email address will not be published.