తైవాన్ పరిసరాల్లో చైనా భారీ సైనిక విన్యాసాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తైవాన్‌ పరిసరాల్లో చైనా గురువారం భారీ సైనిక విన్యాసాలను చేపట్టింది. రెండు రోజుల పాటు జరిగే ఈ డ్రిల్‌ను తైవాన్ వేర్పాటువాద చర్యలకు “బలమైన శిక్షగా డ్రాగన్ ప్రకటించింది. యుద్ధ నౌకలు, విమానాలతో ఆ ద్వీపాన్ని చుట్టుముట్టినట్టు చైనా అధికారిక మీడియా నివేదించింది. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్-తే బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల తర్వాత ఈ డ్రిల్ చేపట్టడం గమనార్హం. తైవాన్‌ను తమ భూభాగంగా చైనా వాదిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తైవాన్ కొత్త అధ్యక్షుడ్ని ప్రమాదకర వేర్పాటువాది బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపిస్తోంది.1949 అంతర్యుద్ధంతో స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తైవాన్‌‌ను.. తిరుగుబాటు చేసిన ప్రావిన్స్‌గా చైనా పరిగణిస్తోంది. ఈ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయతిస్తోన్న చైనా.. బలవంతపు సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని చెబుతోంది. తాజాగా, తైవాన్ చుట్టూ సైనిక డ్రిల్‌ చేపట్టడంతో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ‘జాయింట్ స్వార్డ్-2024ఏ’ కోడ్ పేరుతో ఈ విన్యాసాలను చేపట్టింది. సముద్రతలంలో సంయుక్త యుద్ధ సన్నద్ధత, కీలక లక్ష్యాలపై ఉమ్మడి ఖచ్చితత్వ దాడులపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్టు తెలిపింది.‘చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ గురువారం ఉదయం 7:45 గంటల నుంచి తైవాన్ చుట్టూ ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించింది’ అధికార వార్తా సంస్థ జున్హు తెలిపింది. తైవాన్ జలసంధికి ఉత్తరం, దక్షిణం, తూర్పున మూడు దిక్కుల్లో ఈ డ్రిల్ జరుగుతోందని తెలిపింది. కిన్‌మెన్, మాట్సు, ఉకియు, డోంగియిన్ దీవుల చుట్టూ కూడా విన్యాసాలు జరుగుతాయని జిన్హువా పేర్కొంది.తైవాన్ ద్వీపం చుట్టుపక్కల యుద్ధ నౌకలు, పెట్రోలింగ్ విమానాలను మోహరించి డ్రిల్ నిర్వహించడంతోపాటు సైనిక దళాల ఉమ్మడి పోరాట సామర్థ్యాలను పరీక్షిస్తున్నట్టు సైనిక ప్రతినిధి లీ జీ చెప్పినట్లు వార్తా సంస్థ నివేదించింది. ఈ డ్రిల్ ‘స్వాతంత్ర్య’ తైవాన్ దళాల వేర్పాటువాద చర్యలకు బలమైన శిక్షగానూ, బాహ్య శక్తుల జోక్యం, రెచ్చగొట్టే చర్యలకు వ్యతిరేకంగా గట్టి హెచ్చరికగానూ ఉపయోగపడతాయి’ అని ప్రతినిధి వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్టులోనూ చైనా ఇటువంటి డ్రిల్ చేపడతామని ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.