సీఎం కేసీఆర్‌ విధానాలు అత్యంత ప్రమాదకరం..

-    టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్‌ భూదందా చేస్తున్నారని, ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి ప్రభుత్వ భూములు కట్టబెట్టారని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ అమాత్యులకు భూములు కట్టబెడుతోందని, సీఎం కేసీఆర్‌ విధానాలు అత్యంత ప్రమాదకరమని రేవంత్‌రెడ్డి విమర్శించారు.2012లోనే ఖానామెట్‌లో ఎకరా రూ.12 కోట్లుగా నిర్ణయించారని రేవంత్ రెడ్డి అన్నారు. తక్కువ ధరకు భూములు పొందిన కంపెనీలకు హెచ్‌ఎండీఏ నోటీసులిచ్చిందని, అలెగ్జాండ్రియా ఫార్మా మారుతీ సుజుకీ కి నోటీసులు ఇచ్చిందన్నారు. మారుతీ సుజుకీ ఎకరా రూ.12 కోట్ల చొప్పున చెల్లించిందని, భూమి ధరల విషయంలో అలెగ్జాండ్రియా ఫార్మా కోర్టు కెళ్లిందన్నారు. అలెగ్జాండ్రియా ఫార్మాకు కేటాయించిన భూములపై.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం కన్ను పడిందన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రికి భూములిచ్చేందుకే ఫార్మా కంపెనీపై ఒత్తిడి చేశారని రేవంత్‌ ఆరోపించారు.రవీంద్రరావు, జగన్నాథరావు కలిసి.. అలెగ్జాండ్రియా ఫార్మా భూములు కొట్టేయాలనుకున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఫార్మా కంపెనీలో రవీంద్రరావు, జగన్నాథరావు బలవంతంగా చేరారని.. ఆ ఇద్దరూ హైకోర్టులో కేసు గెలుచుకుని.. ఆ భూమిని దక్కించుకున్నారన్నారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ తన బంధువులకు ఐదు ఎకరాలను పరోక్షంగా కట్టబెట్టారని ఆరోపించారు. హైటెక్‌ సిటీ పక్కన గజం రూ.36 వేల చొప్పున కట్టబెట్టారన్నారు. గజం రూ.80 వేలున్న భూమిని రూ.36 వేలకే ఎలా ఇచ్చారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.