కూలిన స్కూలు జిమ్ పైకప్పు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఓ పాఠశాల జిమ్ పైకప్పు కూలి 11 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటన చైనాలోని హైలాంగ్జియాంగ్ ప్రావిన్సుల్లోని కింగార్ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. లాంగ్‌షా జిల్లా నెం.34 మాధ్యమిక పాఠశాల జిమ్నాజియం పైకప్పు 1,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో జిమ్‌లో 19 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకోగా.. 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు పేర్కొన్నారు.ఇప్పటివరకు, శిథిలాల నుంచి 13 మందిని వెలికి తీయగా.. వీరిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆరుగురు ఆస్పత్రిలో చనిపోయినట్లు వెల్లడించారు. అయితే, స్కూల్ ఆవరణలో మరో భవనం నిర్మిస్తుండగా.. జిమ్ పైకప్పుపై పెర్లైట్‌లు ఉంచినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు పెర్లైట్ తడిసి బరువు పెరిగింది. దీంతో పైకప్పుపై బరువును తట్టుకోలేక కూలిపోయింది.ఈ ఘటనపై విచారణ లోతుగా కొనసాగుతోందని.. నిర్మాణ సంస్థకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు 160 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద సమయంలో వాలీబాల్ ఆటలో పలువురు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు వారి తల్లిదండ్రులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. జిమ్ పైకప్పుపై పైర్లైట్స్‌ను ఎలా ఏర్పాటుచేయడానికి అధికారులు అనుమతించారని నిలదీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.