టీ కాంగ్రెస్‌లో కమిటీల కల్లోలం

- కొండా సురేఖ బాటలో మరో కీలక నేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు రేగుతోంది. టీపీసీసీ కమిటీల కూర్పుపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఎప్పటినుంచో ఉన్న తమను కాదని జూనియర్లకు పార్టీ పదవులు కట్టబెట్టడంపై సీనియర్ నేతలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. అసంతృప్తితో తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తోన్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ తనకు పార్టీ కమిటీల్లో చోటు దక్కలేదనే కారణంతో ఆదివారం పార్టీ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ టీపీసీసీ కమిటీల నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి ఆయన రాజీనామా చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురై రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి కొండా సురేఖ రాజీనామా చేయగా.. ఇవాళ బెల్లయ్య నాయక్ రాజీనామా చేయడం టీపీసీసీలో చిచ్చు రేపుతోంది.

నేడు లేదా రేపు ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. కమిటీల నియామకంపై తమ ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ నేతలను పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఇతర కమిటీల్లో చోటు కల్పించకపోవడంపై భగ్గుమంటున్నారు. తమను కాదని జూనియర్ నేతలకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తోన్నారు. దీంతో టీ కాంగ్రెస్‌లో ఇప్పుడు కమిటీల నియామకం విషయం గుబులు రేపుతోంది. ఇంకా చాలామంది నేతలు కమిటీల కూర్పుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకెంతమంది నేతలు రాజీనామా చేస్తారనేది టీ కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ కమిటీలతోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొవాలని చూస్తోంది. కమిటీలను నియమించి ఎన్నికలకు సిద్దం కావాలని ఆశించిన కాంగ్రెస్‌కు నేతల అసంతృప్తి కొరకరాని కొయ్యలా మారింది. అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలను టీపీసీసీ షురూ చేసినట్లు తెలుస్తోంది. నేతలను ఫోన్లు చేసి రేవంత్ రెడ్డి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీలలో చోటు దక్కలేదని బాధపడద్దని, పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తోన్నారు. కానీ కొంతమంది నేతల విషయంలో టీపీసీసీ బుజ్జగింపుల పర్వం ఫలించడం లేదు. పార్టీ కమిటీల్లో కూడా తమకు గుర్తింపు ఇవ్వకుండా పక్కన పెట్టడం ఆవేదన కలిగిస్తోందని చెబుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు చాలామంది సీనియర్ నేతలకు పార్టీ కమిటీల్లో చోటు దక్కకపోవడం టీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది.

Leave A Reply

Your email address will not be published.