కామారెడ్డి లో వేడెక్కుతున్న రైతుల ఆందోళన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డిలో రైతుల ఆందోళన రోజు రోజుకి వేడెక్కుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, రైతులకు నష్టం చేసే మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ప్రభుత్వ మొండి వైఖరి వీడే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నారు. రైతులకు ప్రతిపక్ష పార్టీల నాయకులు మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారంలో మరింత రచ్చ కొనసాగుతుంది.

కామారెడ్డి మునిసిపాలిటీలో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు కోరుతూ రైతు నిరసన ప్రదర్శనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన కామారెడ్డి రైతులు తమకు నష్టం చేసే కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గం రాజీనామాలు చేశారు. వీరితో పాటు వీడీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించి గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న క్రమంలో కామారెడ్డి లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీంతోపాటు తాజాగా రాము అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది.

నేడు కామారెడ్డి సీఎస్ఐ చర్చి నుండి కలెక్టరేట్ వరకు రైతులు కుటుంబ సమేతంగా భారీ ర్యాలీ చేయడానికి ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. పచ్చని పంట పొలాలలో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ఏర్పాటును నిరసిస్తూ ఇల్చిపూర్, అడ్లూరు, టేక్రియాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి, లింగాపూర్ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక జారీ చేసింది. కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యేలకు రైతులు అల్టిమేటం నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ ను మార్చకపోతే, వెంటనే రైతుల పంట పొలాలకు నష్టం చేసే మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోకపోతే ఎమ్మెల్యేలను తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలు దీనిపై తమ వైఖరి స్పష్టం చెయ్యాలని అంటున్నారు. ఇక ప్రస్తుతం రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, అలాగే పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ బిజెపి నాయకులు నిలిచారు. తక్షణం రైతులు విజ్ఞప్తి చేస్తున్నట్టు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని వారు సైతం డిమాండ్ చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.