షాద్ నగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ ప్రభంజనం

.. అడుగడుగునా రాహుల్ గాంధీకి నీరాజనాలు .. 3 కిలోమీటర్ల నిండా కాంగ్రెస్ సైనికులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: షాద్ నగర్ నియోజక వర్గ రాజకీయ చరిత్రలోనే ఎవరు కనివిని ఎరుగని రీతిలో మొట్ట మొదటిసారి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గంలో సోమవారం ఉదయం 6 గంటలకే ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కొనసాగింది. అడుగడుగునా నీరాజనాలతో, కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో నేషనల్ హైవే పాత రోడ్డు పులకరించిపోయింది. కాంగ్రెస్ సైనికులు వేలాదిగా తరలిరావడంతో యాత్ర నభూతో న భవిష్యత్ అన్న చందంగా మారింది. గుజరాత్ లో వంతెన నిర్మాణం కూలి మృతి చెందిన మృతులకు నివాళి అర్పించిన అనంతరం ఆయన షాద్ నగర్ లో పాదయాత్ర సాగించారు. అనంతరం షాద్ నగర్ చౌరస్తాలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చడంతో పాటు ఆకాశం నిండా బెలూన్లను వదిలారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాల కలకలతో వేలాదిమంది రాహుల్ కు ముందు వెనుక నడిచారు. రాహుల్ గాంధీ వెంట స్థానిక ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, చల్ల వంశీచంద్ రెడ్డి, మరెందరో కీలక నాయకులు రాహుల్ అడుగులో అడిగేసి నడిచారు. లింగారెడ్డి గూడ వద్ద పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు లభించాయి. అదేవిధంగా చంద్రాయన గూడ, నందిగామ, కొత్తూరు వద్ద భారీ ఎత్తున స్వాగతం ఏర్పాటు చేశారు.

జనమా ప్రభంజనమా..!

జనమ ప్రభంజనమా అనే విధంగా దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా కాంగ్రెస్ శ్రేణులు నిండిపోయారు. పాత హైవే రోడ్డులో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ర్యాలీ ఎవరు కనివిని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున యాత్ర కొనసాగింది. రేవంత్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు రాహుల్ వెంట నడిచారు. కాంగ్రెస్ సైనికుల కేరింతలు ఉత్సాహం ఉల్లాసం అందరిని కిక్కెక్కించింది. రోడ్డు పొడవునా నినాదాలతో హోరెత్తించారు. ప్రతి గ్రామం మలుపుల వద్ద రాహుల్ గాంధీకి అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. రాహుల్ గాంధీని చూడటానికి గ్రామస్తులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చారు. అందరికీ రాహుల్ చేయి ఊపుతూ నమస్కరించారు. మహిళలు పిల్లలు కనిపిస్తే వారిని ఆప్యాయంగా పలకరించారు. కొందరు చిన్నారులను తన వెంటే నడిపించుకుంటూ వెళ్లారు. నందిగామ వద్ద కాసేపు టీ బ్రేక్ ఉండడంతో అక్కడ గిరిజనుల సంప్రదాయ నృత్యాన్ని స్వయంగా వీక్షించారు.

.. 30 వేల మందికి అన్నదానం

షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ సైనికుల కోసం వేలాది మందికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి సర్వసదుపాయాలు కల్పించడంతోపాటు దాదాపు 30 వేల మందికి నందిగామ, కొత్తూరు ఇతర ప్రాంతాల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎంతో పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ వీర్లపల్లి శంకర్ ఒంటిచేత్తో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల పార్టీ శ్రేణులు అభినందించారు. రెండు రోజులపాటు కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించి వీర్లపల్లి శంకర్ శభాష్ అనిపించుకున్నారు. వీర్లపల్లి శంకర్ జన ప్రవాహం చూసి రాహుల్ గాంధీ అభినందించారు. అన్ని ప్రాంతాల కంటే తెలంగాణలో షాద్ నగర్ నియోజకవర్గంలో వచ్చిన స్పందన పట్ల మాట్లాడారు. అందరూ వీర్లపల్లి శంకర్ కృషిని అభినందించారు. కార్నర్ మీటింగ్ కోసం పాతికవేల మందికిపైగా జన సమీకరణ చేయగా మరుసటి రోజు సోమవారం కూడా 30 వేల మందికి పైగా జన సమీకరణ చేయడంతో అధిష్టానం అభినందనలను శంకర్ అందుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శంకర్ శభాష్ అనిపించుకున్నారు.

.. కొత్తూరులో సేద తీరిన రాహుల్

షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో రాహుల్ గాంధీ సేద తీరారు. పాదయాత్రకు సంబంధించిన మంది మార్బలం తోపాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ బసచేసిన ప్రాంతంలో మీడియాతో పాటు అగ్ర నాయకులు తదితర ముఖ్యమైన వ్యక్తులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కార్యకర్తలకు ప్రజలకు యాత్రకు సంబంధించిన ఇతర వర్గాలకు వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సుమారు 30 వేల మందికి నందిగామ కొత్తూరు ప్రాంతాల్లో బోజన సౌకర్యం కల్పించారు. 10 గంటల వరకే కొత్తూరుకు విచ్చేసిన రాహుల్ గాంధీ భోజనం విరామం వరకు సేద తీరారు. అప్పటికి భోజనాలు పూర్తి చేసుకున్న అనంతరం రెండు గంటలకు మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాదయాత్రకు అన్ని తానై నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని వీర్లపల్లి శంకర్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో పెద్ద కార్యక్రమం అని తాను కూడా జీవితంలో కనివిని ఎరగలేదని ఇంత పెద్ద పాదయాత్రను తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ద్వారా కళ సహకారమైందని అన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడవడం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆధర అభిమానాలు చూసి ముగ్ధుడిని అయ్యానని అన్నారు. రానున్నది రాహుల్ రాజ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. తనకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా పోలీసు శాఖ ఇతర ప్రభుత్వ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు మొదలైంది. భారత్ జోడో యాత్ర సోమవారం 28కిలోమీటర్ల మేర సాగనున్నదని పేర్కొన్నారు. షాద్‌నగర్‌ నుంచి ముచ్చింతల్‌ దగ్గర పెద్దషాపూర్‌ వరకు యాత్ర నిర్వహించనున్నారు. కొత్తూరులో మధ్యాహ్న భోజన విరామం. సాయంత్రం 7 గంటలకు ముచ్చింతల్ దగ్గర రాహుల్‌గాంధీ సభ జరగనుంది. రాత్రికి శంషాబాద్‌ శివారు తండుపల్లి దగ్గర బస చేయనున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాహుల్ పాదయాత్ర కన్యాకుమారి నుంచి 54 రోజులుగా కొనసాగుతుంది. వివిధ వర్గాల సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. బీజేపీపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విద్యా సంస్థల ప్రయివేటీకరణకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ను మెరుగు పరుస్తామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.