కాంగ్రెస్ పార్టీ పొదుపు సంస్థ .. బీజేపీ అంటే పూజా సంస్థ…

-    బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగిన రాహుల్‌ గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఇవాళ హర్యానాలో కొనసాగుతున్నది. ఉదయం 6 గంటలకు తారావాడి నుంచి యాత్ర ప్రారంభమైంది. పొగమంచు, తక్కువ వెలుతురులోనే రాహుల్ గాంధీ తన పాదయాత్రను చేపట్టారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ పొదుపు సంస్థ అని.. బీజేపీ అంటే పూజా సంస్థ అని వ్యగ్యంగా పేర్కొన్నారు. ఈ దేశం పూజారులది కాదని, సన్యాసులదని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు తాము చెప్పినట్లుగా పూజలు చేయాలని కోరుకుంటున్నాయని దుయ్యబట్టారు. ‘పూజలు రెండు రకాలు. సాధారణంగా దేవుడి వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. రెండో రకం మోదీ రకం. తమను బలవంతంగా పూజించాలనేది మోదీ రకం. దేశంలోని ప్రతి ఒక్కరూ తనను ఆరాధించాలి. తాము చెప్పినట్లుగానే ప్రజలంతా పూజలు చేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకుంటాయి. అలా ఎట్ల కుదురుతుంది. తన యాత్ర మన దేశంలో వ్యాప్తి చెందుతున్న భయాందోళనలు, మతం, కులం పేరుతో విభజన విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. ఈ ప్రయాణం ఒక తపస్సులాంటిది. ఈ యాత్ర వల్ల లాభమో, నష్టమో నేను చెప్పలేను. భయానికి వ్యతిరేకంగా నిలబడటం, మన దేశాన్ని ఏకం చేయడం అనే లక్ష్యాలతో నా యాత్ర కొనసాగుతున్నది’ అని రాహుల్ వెల్లడించారు. ఇక రెండో అంశం భారత్‌లో ఆర్థిక అసమానత.. ఇందులో డబ్బు, మీడియా, ఇతర సంస్థలు కేవలం 3-4 చేతుల్లోనే ఉండి భయంకరమైన నిరుద్యోగాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రైతులను చంపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. చిన్న వ్యాపారులను చంపడానికి జీఎస్టీ, డిమానిటైజేషన్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇలాంటివి ఉండవని చెప్పారు. రైతులకు రక్షణ ఉంటుందన్నారు. కోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసినప్పుడు రైతులకు కూడా చేసి ఉంటే ఎంతో మేలు జరిగి ఉండేది కదా అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.