సమాధుల్లో నుంచి పైకి తేలుతున్న శవాలు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : వానలు వరదలు తీసుకొచ్చే కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కొందరు ఇళ్లు మునిగి రోడ్డున పడితే.. మరికొందరు ఉన్నదంతా పొగొట్టుకుంటారు. ఇక ముంపు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఇళ్లే కాదు స్మశానాలు కూడా కొట్టుకుపోతుంటాయి. అంత్యక్రియలు చేయడం సంగతి అటుంచితే.. సమాధుల్లో శవాలు కూడా నీళ్లలో తేలుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి దుస్థితితే కాకినాడ జిల్లా లోని ఓ గ్రామ ప్రజలకు వచ్చింది. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో బ్రౌన్ పేట శివారులో పిఠాపురం రోడ్డులోని నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద క్రైస్తవుల సమాధుల తోట ఉంది. వంతెన నిర్మాణం కారణంగా సమాధులను ఆనుకుని అధికారులు ఓ తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు కారణంగా ఏలేరు పిల్ల కాలువ ద్వారా వచ్చే వరద జలాలు ప్రధాన కాలువలో కలిసే చోట సిమెంట్ తూరలు ఏర్పాటు చేశారు. దానితో వరదకు వచ్చే జలాలు ప్రవాహానికి అవి సరిపోక పోవడంతో వరద జలాలు శ్మశానవాటికలోకి పోటెత్తి సమాధులు ముంపుకు గురవుతున్నాయి. ఆ క్రమంలో ఆ స్థలం కోతకు గురై భూమిలో పాతిపెట్టిన శవాలు పైకి తేలుతున్నాయి. దానిలో భాగంగానే గత కొద్దరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్మశాన వాటిక కోతకు గురై మంగళవారం ఉదయం ఒక మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. అయితే మృతదేహం పైకి కనిపించకుండా ప్లాస్టిక్ కవర్‌తో కట్టి ఉంది. దానిని పరిశీలించిన స్థానికులు కరోనా సమయంలో మృతిచెందిన మృతదేహంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

శ్మశాన వాటికకు స్థలాన్ని సమకూర్చాలి

క్రైస్తవ శ్మశాన వాటికకు స్థలం సరిపడని కారణంగా కొన్నేళ్ల క్రితం ఏలేరు కాలువను ఆనుకుని ఉన్న ఈ స్థలాన్ని సమకూర్చుకోగా… అదికూడా నిండుకుని ఇలా వరద జలాల కోతకు గురవుతున్నందుని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని క్రైస్తవ సమాదులకు మరోచోట స్థలాన్ని సమకూర్చి సమస్యను పరిష్కరించాలని పట్టణ పరిధిలోని క్రైస్తవ నాయకులు, ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.