అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీసిన పత్తి, మిరప పంటలు

- ఉపాధి లేక భారమైన కుటుంబ పోషణ..దీంతో ఊళ్లకు ఊళ్లే వలసబాటలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్నూలు జిల్లాలో పత్తి, మిరప పంటలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమైంది. దీంతో.. ఊళ్లకు ఊళ్లే వలసబాట పట్టాయి. కోసిగి మండలం నుంచి బుధవారం ఒక్క రోజే దాదాపు పది వేల మంది కూలీలు వలస వెళ్లారు. కోసిగితో పాటు ఆర్లబండ, సజ్జలగూడెం, కందుకూరు, కోల్‌మాన్‌పేట, కామన్‌దొడ్డి, దుద్ది, చిర్తనకల్‌, సాతనూరు, అగసనూరు తదితర గ్రామాల నుంచి ఊళ్లన్నీ వలసబాట పట్టాయి. కోసిగిలోని 3వ వార్డులో బాగా పేరున్న రైతు బుగేనీ ఈరప్ప కుటుంబసభ్యులు మొదటిసారిగా వలసబాట పట్టారు. ఈ ఏడాది కరువు విలయతాండవం చేయడంతో వలసలు తప్పడం లేదని ఆర్లబండ గ్రామానికి చెందిన మజ్జిగ ఈరన్న ఆవేదన వ్యక్తం చేశాడు.మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో బుధవారం రాత్రి పది వాహనాల్లో 600 మంది వలసబాట పట్టారు. రెండు రోజుల క్రితం కూడా 300 మంది వలస వెళ్లారు. దీంతో ఊరంతా ఖాళీ అయింది. కౌతాళం నుంచి బుధవారం సుమారు 200 కుటుంబాలు గుంటూరుకు వలస వెళ్లాయి. కొండక్కగేరి, ఎన్టీఆర్‌ నగర్‌, బైటగేరి గ్రామాల నుంచి నాలుగు వాహనాల్లో వెళ్లారు. అలాగే పొదలకుంట, మదిరె గ్రామాల నుంచి రెండు లారీల్లో వలసలు పోయారు. పెద్దకడబూరు మండలంలోని మురవణి గ్రామం నుంచి బుధవారం 20 కుటుంబాలు తెలంగాణకు వలస వెళ్లాయి.

Leave A Reply

Your email address will not be published.